ఏపీలో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు 40 ఏళ్ల చంద్రబాబుకు ఇక్కడ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవడం పెనుసవాల్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు నెలలు కూడా కాకుండానే అప్పుడే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఇక అప్పుడే ఆయన జిల్లాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు పెడుతున్నారు.
మరోవైపు జారీపోతోన్న నేతలను కాపాడుకోవడంతో పాటు కేడర్‌లో నమ్మకం కలిగించేందుకు బాబు పడుతోన్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. నేతలు దూరమైనా సరే నేను ఉన్నాను అంటూ భయపడుతున్న కార్యకర్తలకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాబు ఎంత కష్టపడుతున్నా టీడీపీ కీలక నేతలు, సీనియర్లకు ఎంత మాత్రం పట్టడం లేదు. వాళ్లు పార్టీ ఉంటే ఉంటుంది… లేకపోతే లేదు.. ఐదేళ్ల పాటు మేం ఎందుకు పోరాటాలు చేయాలి ? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా నెలకు రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నేతలను విజయవాడ పిలిపించుకుని చంద్రబాబు సమావేశాలు పెడుతున్నారు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి విజయవాడ వస్తే తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టి… పసలేని మీటింగ్‌లు పెడుతున్నారు. దీంతో ఇవేం మీటింగ్‌ల్రా బాబు అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అసలు చంద్రబాబు ఎందుకు సమావేశాలు పెడుతున్నారో ? ఆయన ఏం చెప్పదలచుకున్నారో ? ఆయనకే క్లారిటీ లేదన్నట్టు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. చివరకు బాబు ఓ వైపు ప్రసంగాలు చేస్తుంటే పార్టీ నేతల ఎప్పుడు భోజనం టైం అవుతుందా ? అని వెయిట్ చేస్తూ మధ్యలోనే భోజనాలకు లేచి వెళ్లిపోతుండడం కనిపిస్తోంది. బాబు ఇటీవల నిర్వహించిన రెండు, మూడు రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఇదే తంతు నడుస్తోంది. దీనిని బట్టి బాబుగారిపై ఆ పార్టీ నేతలకు ఉన్న ప్రేమేంటో అర్థమవుతోంది.