మంత్రి స్థానంలో మాజీ మంత్రి ఫోటో.. అవాక్కైన ధర్మాన కృష్ణదాస్

రాజమండ్రి: ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా జక్కంపూడి మండలం రాజాపూడి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. అక్కడి శిలాఫలకంపై తన ఫొటోకు బదులుగా ఆయన సోదరుడు ధర్మాస ప్రసాదరావు ఫొటో ఉండటం చూసి అవాక్కయ్యారు.

శిలాఫలకంపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫొటో బదులు ఆయన సోదరుడు మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఫొటో ఉండటం చూసి మంత్రితో పాటు పక్కనే ఉన్న ఇతర నేతలు సైతం ఉలిక్కపడ్డారు. తన స్థానంలో ధర్మాన ప్రసాదరావు ఫొటో ఉండటం చూసి మంత్రి కృష్ణదాస్ అసహనం వ్యక్తం చేశారు. ఫొటో మారడంతో నాలుక కరుచుకున్న అధికారులు వెంటనే ప్రసాదరావు ఫొటోకు పెయింట్ వేశారు.

 

మరోవైపు మంత్రి కృష్ణదాస్ పక్కనున్న శిలాఫలకంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫొటోను చూసి మరోరకంగా చర్చించారు. కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావును అధికారులు ఇంకా మర్చిపోలేదు కాబోలు అని సెటైర్లు వేసుకుంటున్నారు.