టీఆర్‌ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పీకే.. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ భవితవ్యం తేల్చేందుకు.. గ్రౌండ్ స్థాయిలో పని మొదలు పెట్టగా.. తాజాగా ఆయన చేసిన సర్వే లీక్ అయింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్టు.. టీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార TRS పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇచ్చిన నివేదిక TRS పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇంటిలిజెన్స్, పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేలు ఎప్పుడూ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాయనేది చెప్పుకోవాల్సిన పనిలేదు. PK టీమ్ పక్కా ప్రొఫెషనల్స్, కమర్షియల్స్ కావడంతో వారు ఎలాంటి మొగమాటాలు లేకుండా నివేదికలు ఇస్తుంటారు. వాటిలో చాలావరకు వాస్తవరూపం దాల్చాయని అందరికీ తెలుసు. గత ఏడాదిన్నరగా TRS పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని, ఈసారి BJP పక్కాగా వస్తుందని ఆ పార్టీ నాయకులు టముకు వేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే కేంద్రం నుంచి ప్రధానమంత్రి స్థాయి నేతలు కూడా రెండు మూడు నెలలకోసారి తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. భారీ సభలు నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నది.
ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ సహజం. PK ఇచ్చిన నివేదికలో TRS పార్టీకి ఊరట ఇచ్చే అంశం ఏమిటంటే కొందరు స్థానిక MLAల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ KCR గారి మీద అభిమానం తెలంగాణ వ్యాప్తంగా ఇసుమంత కూడా తగ్గలేదని. తెలంగాణ సాధకుడుగా KCR ఆర్జించిన కీర్తిప్రతిష్టలు అజరామరం. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్, ధాన్యం దిగుబడి కోటిన్నర మెట్రిక్ టన్నులు దాటిపోవడం, ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యికి పైగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కరెంట్ కోతలు లేకపోవడం, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి వందలాది పథకాలు కేసీఆర్ ను ప్రాతఃస్మరణీయుడిని చేశాయి. మొత్తానికి పీకే సర్వే ప్రకారం..సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తున్నాయన్న మాట.