ప్రపంచవ్యాప్తంగా శాకాహారం, మాంసాహారం.. తినేవారు ఉన్నారు. అయితే మాంసాహారం వల్ల ప్రోటీన్లు, ఇతర పోషకాలు లభించినప్పటికీ శాకాహారం తినేవారు.. అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ పాటించే వారు అధిక బరువు త్వరగా తగ్గుతారని వెల్లడైంది. ప్లాంట్ బేస్డ్ డైట్ తినే వారిలో నెమ్మదిగా మెటబాలిజం పెరుగుతుందని, దీంతో బరువు తగ్గుతారని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు వారు జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో తమ పరిశోధనల తాలూకు వివరాలను కూడా ప్రచురించారు.
సైంటిస్టులు కొంత మంది వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక గ్రూపు వారికి 16 వారాల పాటు కేవలం శాకాహారం మాత్రమే, అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ తినమని చెప్పారు. ఇంకో గ్రూపుకు డైట్ పాటించకుండా వారు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం తినమని చెప్పారు. దీంతో 16 వారాల తరువాత ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకున్న వారి మెటబాలిజం ఏకంగా 18.7 శాతం పెరిగిందని, అలాగే వారు సగటున 6.4 కిలోల వరకు బరువు కూడా తగ్గారని, శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గిందని గుర్తించారు. ఇక రెండో గ్రూపులో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
అందువల్ల సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. శాకాహారం తినాలని.. అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ అయితే మరీ మంచిదని చెబుతున్నారు. అంటే కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే తినాలి. అలాగే నట్స్, పప్పు దినుసులు, విత్తనాలు తినవచ్చు. రీఫైన్డ్ ఫుడ్స్, చక్కెర, స్వీట్లు, ఇతర తీపి పదార్థాలు, మైదా పిండి, ప్రాసెస్ చేయబడిన ఆయిల్స్ తీసుకోకూడదు. ఈ విధంగా డైట్ పాటిస్తే శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.