కరోనా నేపథ్యంలో పిల్లలు ఫోన్‌లను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ క్లాస్‌లు, ఆ తర్వాత ఫోన్లో గేమ్‌లు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ, తల్లిదండ్రులకు ఒక్క విషయం తెలిస్తే పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడనివ్వరు. వీడియో గేమ్‌ల వల్ల లాభాలు, నష్టాలను పరిశోధనలు విశ్లేషించాయి. హింసాత్మకంగా ఉండే కొన్ని రకాల వీడియో గేమ్స్ పిల్లల్లో హింసను ప్రోత్సహిస్తాయని కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతారు. ఇది నిజమే కానీ వీడియో గేమ్స్ ఆడేవారిలో సమస్యలు పరిష్కరించే విధానం, నైపుణ్యాలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. కానీ గేమింగ్ సవాళ్లను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎక్కువ సమయం గేమింగ్ ప్లాట్‌ఫాంలలో గడపడం వల్ల పిల్లలు భావోద్వేగానికి గురయ్యే∙అవకాశం ఉంది. దీనినే గేమింగ్ డిజార్డర్స్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ డిజార్డర్ తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. దీనివల్ల పిల్లల్లో ఎపిలెప్సీ అనే మెదడు సంబంధ వ్యాధికి గురవుతున్నారని ఆ సంస్థ పేర్కొంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించింది.
మెదడులో సహజంగా ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీలో లోపాలు ఏర్పడటాన్ని ఎపిలెప్సీ అంటారు. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు తరచుగా మూర్ఛపోతారు. మెదడులోని న్యూరో ట్రా¯Œ ్సమిటర్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలు, మహిళలు ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితికి నిర్ధిష్టమైన చికిత్స అందుబాటులో లేదు. కానీ ఈ వ్యాధి లక్షణాలను, ప్రతికూల ప్రభావాలను కొన్ని రకాల మందులతో కట్టడి చేయవచ్చు.
వీడియో గేమ్స్‌కు, ఎపిలెప్సీ వ్యాధికి సంబంధం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీతో బాధపడుతున్న వ్యక్తుల్లో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్లాషింగ్ లైట్లు, వైబ్రెంట్ ప్యాటర్న్ మూర్ఛలు రావడాన్ని ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. అంటే ఈ రెండింటికీ సంబంధం ఉన్నట్లు భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రకమైన ఎపిలెప్సీని ’వీడియో గేమ్ ఇండ్యూజ్డ్ సీజర్స్’ (vg ) అంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సాధారణంగా ఎవరికైనా మూర్ఛ వచ్చినప్పుడు శరీర కండరాలు బిగుతుగా మారుతాయి. మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం, అపస్మారక స్థితిలో ఉండటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపించవచ్చు.
- ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు మూర్ఛలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.
- నీరు తాగించడం, తినిపించడం వంటివి చేయకూడదు. వారికి గాయాలు కాకుండా చూడాలి. ఆ సమయంలో వారి కాళ్లు చేతులు కొట్టుకుంటాయి. అప్పుడు వారిని బలవంతంగా నేలపై అదిమి ఉంచకూడదు.
- మూర్ఛ వచ్చినప్పుడు బాధితులకు శ్వాస ఆడేలా చూడాలి. వారి తలను శరీరానికి సమాతరంగా ఉంచి, సరిగ్గా ఊపిరి తీసుకునే అవకాశం కల్పించాలి.