దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో వైన్ షాపులను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే మద్యం షాపులు మూసివేయడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్తీ మద్యం ఎక్కువగా సరఫరా అవుతుందని.. అలాగే మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని.. కనుక ఆయా రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతినివ్వాలని.. Confederation of Indian Alcoholic Beverage Companies (CIABC) కోరింది. ఈ మేరకు సీఐఏబీసీ 10 రాష్ట్రాల సీఎంలకు మంగళవారం లేఖలు రాసింది.
ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలకు సీఐఏబీసీ లేఖలు రాసింది. మద్యం షాపులను మూసివేయడం వల్ల కల్తీ మద్యం ఎక్కువగా సరఫరా అవుతుందని, మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారని, పలు చోట్ల మద్యం తాగక కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారని.. కనుక వారి ఆరోగ్యం దృష్ట్యా అయినా.. మద్యం షాపులను తెరవాలని.. సీఐఏబీసీ ఆయా రాష్ట్రాలను కోరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక.. మద్యం విక్రయాలను కొనసాగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐఏబీసీ కోరింది.
ప్రజలు కరోనా లాక్‌డౌన్ దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తున్నారని… కనుక నిత్యం కొద్ది సమయం పాటు మద్యం అమ్మేలా ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతులు ఇవ్వాలని సీఐఏబీసీ విజ్ఞప్తి చేసింది. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని.. ఆ సంస్థ తెలిపింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఇంకా స్పందించాల్సి ఉంది.