దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద కేంద్రం ఏటా రూ.6వేలను అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 3 విడతల్లో విడతకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.6వేలను చెల్లిస్తారు. ఆ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాలకే నేరుగా బదిలీ అవుతుంది. అయితే ఈ మొత్తాన్ని పెంచే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. పార్లమెంట్ లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కేంద్రం ఏటా ఒక్కో రైతుకు పంట పెట్టుబడి సహాయం కింద రూ.6వేలను అందిస్తుందని, అయితే ఈ మొత్తాన్ని పెంచే ఆలోచన లేదన్నారు. ఇక అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో తప్ప ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీంను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లో 70.82 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని, అయితే అనర్హులను ఎప్పటికప్పుడు గుర్తించి వారిని తొలగిస్తున్నామని, కేవలం అర్హులైన రైతులకు మాత్రం ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
కాగా రాజస్థాన్‌లో ఈ స్కీం కోసం రూ.7,632 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌ళో 1,47,799 మంది లబ్ధిపొందారని అన్నారు. అలాగే ఆ రాష్ట్రంలోని దవుసా జిల్లాలో 1,71,661 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో మార్చి 11వ తేదీ వరకు అనర్హులైన లబ్ధిదారుల నుంచి రూ.78.37 కోట్ల సొమ్మును రికవరీ చేసినట్లు తెలిపారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా రైతులకు అందే మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అందుకు గాను pmkisan.gov.in అనే సైట్‌లోకి వెళ్లి హోం పేజీలో ఉండే ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఉండే బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను ఎంటర్ చేయాలి. అనంతరం కింద ఉండే గెట్ డేటాపై క్లిక్ చేయాలి. దీంతో తెరపై స్టేటస్ ప్రత్యక్షమవుతుంది. అందులో పీఎం కిసాన్ స్కీం కింద సహాయం అందుతుందీ, లేనిదీ తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైనా స్టేటస్ పెండింగ్ అని చూపితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. పీఎం కిసాన్ స్కీం సహాయం అందుతుందని అర్థం చేసుకోవాలి.