భారత్ లో 36వ జాతీయ క్రీడలు గుజరాత్ అహ్మదాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రీడలను ప్రారంభించారు. సంగీత విభావరితో మొదలైన కార్యక్రమం ఆద్యంతం అలరించింది. శంకర్ మహాదేవన్ తదితర గాయకుల పాటలకు అనుగుణంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు స్టెప్పులతో స్టేడియాన్ని హోరెత్తించారు.
పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు ఇతర జనాలతో స్టేడియం దాదాపుగా నిండిపోయినట్లే కనిపించింది. జాతీయ క్రీడల మస్కట్‌తో కూడిన ప్రత్యేక వాహనంలో మైదానంలో తిరిగిన ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. మైదానంలో కళాకారులు విభిన్న నృత్య రూపకాలు ప్రదర్శించారు. అందులో గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్భా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై నుంచి స్వర్ణిమ్ గుజరాత్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రధాని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అథ్లెట్స్ పీవీ సింధు, నీరజ్ చోప్రా సహా పలువురు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ 36వ జాతీయ క్రీడా శకటంపై మైదానంలో తిరిగారు. స్టేడియంలోని క్రీడాభిమానులకు అభివాదం చేశారు.