ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లి హీరాబెన్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు ఆయన హాస్పిటల్ కు వచ్చారు. గంట పాటు అక్కడనే ఉన్న మోడీ చికిత్సకు సంబంధించిన వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మోడీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు హెల్త్ బుటిలెన్ రిలీజ్ చేశారు. మరోవైపు హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హీరా బెన్ వయస్సు 100 ఏండ్లు. గాంధీనగర్ లోని ప్రధాని సోదరుడు పంకజ్ భాయ్ తో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే.. మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఇటీవల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ కు స్వల్ప గాయాలయ్యాయి.