నేడు దక్షిణాదికి ప్రధాని మోదీ.. కర్ణాటక, తమిళనాడులో పర్యటన

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన ఇవాళ ప్రారంభం కానుంది. నేడు మోదీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం శనివారం రోజున తెలంగాణకు రానున్నారు.

బెంగళూర్‌లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.5 వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్‌-2ను ఇవాళప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. 108 అడుగుల ఎత్తయిన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బెంగళూర్‌లోని కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో చెన్నై-మైసూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తర్వాత ప్రధానమంత్రి తమిళనాడులోని దిండిగల్‌కు వెళ్లి అక్కడ గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ 36వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

శనివారం ఉదయం మోదీ ఏపీ పర్యటన మొదలవుతుంది. విశాఖపట్నం చేరుకోనున్న మోదీ.. రూ.3,750 కోట్లతో నిర్మించనున్న రాయ్‌పూర్‌-విశాఖపట్నం ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి, కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి శీలానగర్‌ జంక్షన్‌ వరకు పోర్టు కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. శ్రీకాకుళం-గజపతి కారిడార్‌ (జాతీయ రహదారి-326ఏ) పరిధిలో రూ.200 కోట్లతో నిర్మించిన నరసన్నపేట-పాతపట్నం రహదారిని జాతికి అంకితం చేస్తారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

శనివారం మధ్యాహ్నం తెలంగాణ చేరుకోనున్న ప్రధాని మోదీ రామగుండంలో రూ.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ను (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) జాతికి అంకితం చేస్తారు. రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news