తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా కానున్నారు. ఆయన ఎన్నికపై అసెంబ్లీ సచివాలయం శుక్రవారం అధికారిక ప్రకటన చేయనుంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరూ నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపలేదు..దీంతో గురువారం సాయంత్రం నాటకి పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ గా ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. శాసనసభ స్పీకర్‌గా పోచారం ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎప్పటిలానే సంప్రదాయ పద్ధతిలో సీఎం కేసీఆర్‌తోపాటు మిగిలిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ స్థానంలో కూర్చో బెట్టనున్నారు.
పోచారం ప్రస్థానం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరునే ఆయన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి నాటి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించి..1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తెదేపా ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ సూచనలతో ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సౌమ్యంగా వ్యవహరించే గుణంగల మంచి నేతగా ఆయన ప్రసిద్ధి. రైతు కుటుంబ నుంచి వచ్చిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ స్పీకర్ స్థానాన్ని చేపట్టడం సామాన్యులకు గర్వకారణంగా ఉందంటూ పలువురు నేతలు పేర్కొంటున్నారు.