కవిత: ఎప్పుడు వస్తావు?

-

నువ్వెప్పుడు వస్తావోనాని ఎంతగా ఎదురుచూస్తున్నానో నీకు తెలియదు
పొద్దున్న లేవగానే వినిపించే పక్షుల కిలకిలరావాలు
నీతో పాటు వినాలనుంటుంది
కానీ పక్కన నువ్వుండవు.

మొబైల్ నెట్ ఆన్ చేయగానే వచ్చే నోటిఫికేషన్లు
నువ్వు మెసేజ్ చేయడం వల్లే అనుకుంటా
చెక్ చేస్తే గానీ తెలియదు
నీ నుండి ఒక్క మెసేజ్ రాలేదని.

ఉదయం పదవుతుంది
పక్కింటి పాప ఏడుపులు వినిపిస్తాయి
స్కూలుకు వెళ్ళనని మారాం చేస్తుంటుంది.
మన పాప ఏడుపులు వాళ్ళెప్పుడు వింటారా అనుకుంటా

మద్యాహ్నం అవుతుంది
చిన్నపాటి కునుకు కళ్ళమీదకి వస్తుంది
నాతో గిల్లికజ్జాలు పెట్టుకుని
కునుకుని దూరం చేసే నీ అల్లరి కావాలనిపిస్తుంది.

సాయంత్రం సరదాగా ఊరు చూడాలనుంటుంది.
పెళ్ళై సంవత్సరం అవుతున్నా
బస్టాండు నుండి ఇంటికి వచ్చే దారి తప్ప ఇంకోటి తెలియదు
నాకు తెలియని దారుల్లో ఊరంతా తిరుగుతూ
రోడ్డు పక్కన మిర్చీబజ్జీ తింటే వచ్చే ఆనందాన్ని అనుభవించాలనుంటుంది.
ఆ ఆనందాన్ని నాకెప్పుడిస్తావ్

రాత్రిపూట పక్క మీద వాలిన తర్వాత
అత్తమ్మ వాళ్ళకి వినిపిస్తాయేమోనని
చిన్న కంఠంతో పెట్టే గుసగుసలు
ఇప్పుడే కావాలనిపిస్తుంది.
పక్కకి తిరిగి చూస్తే నువ్వుండవు.

ఎప్పుడు వస్తావని ఆలోచిస్తూ
వచ్చాక నేననుకున్నవన్నీ జరుగుతున్నట్టు ఊహిస్తూ
నిద్రాలోకంలోకి వెళ్ళిపోతాను.

మళ్ళీ తెల్లారుతుంది.
ఇంకా ఎప్పుడు వస్తావు..?

-శ్రీరామ్ ప్రణతేజ.

Read more RELATED
Recommended to you

Latest news