టెన్షన్ : యూ టర్న్‌ తీసుకున్న చైనా.. బోర్డర్ లో 40వేల మంది చైనా బలగాలు..!

-

తూర్పు గాల్వ‌న్‌ లోయ‌ వద్ద ఉద్రిక్తతలు నెలకొనేలా చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత డ్రాగన్‌ చర్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. అలాగే చైనాకు సంబంధించిన యాప్స్ ను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో గాల్వాన్ లోయతోపాటూ హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఇండియా, చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో సమస్య సద్దుమనిగింది అందరూ అనుకున్నారు.. కానీ, ఇక్కడే చైనా మరోసారి తన వక్ర బుద్దిని బయటపెట్టింది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా 40వేల మంది చైనీస్ బలగాలు మోహరించి ఉన్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

భారత్, చైనా మధ్య జరిగిన చర్చల్లో భాగంగా బోర్డర్ నుంచి వెనక్కి జరగాలని అంగీకారానికి వచ్చాయి. కానీ, చైనా మాత్రం ఇంకా ఎల్ఏసీ వద్ద 40వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి ఉందని ఏఎన్ఐ తెలిపింది. ముఖ్యంగా లద్దాక్ వైపు ఈ బలగాలు ఉన్నట్టు పేర్కొంది. ‘సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలన్న చర్చల ఒప్పందాన్ని చైనా అమలు చేయడం లేదు. ఇంకా భారీగానే చైనీస్ బలగాలు సరిహద్దుల్లో ఉన్నాయి. సుమారు 40వేల మంది వరకు భారీ ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్‌తో మోహరించి ఉన్నారు.’ అని ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news