ప్రణబ్ తండ్రి పేరు కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మీ. ప్రణబ్ ముఖర్జీ… కలకత్తా యూనివర్సిటీ నుంచి హిస్టరీలో పీజీ పూర్తి చేశారు. లా కూడా చదివారు. టీచర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రణబ్.
ప్రణబ్ ముఖర్జీ… మాజీ రాష్ట్రపతి మాత్రమే కాదు. ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేశారు. అందుకే… ఆయనను భారతరత్న అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ లోని బిర్బుమ్ జిల్లా మిరాటీలో ఆయన జన్మించారు.
ప్రణబ్ తండ్రి పేరు కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మీ. ప్రణబ్ ముఖర్జీ… కలకత్తా యూనివర్సిటీ నుంచి హిస్టరీలో పీజీ పూర్తి చేశారు. లా కూడా చదివారు. టీచర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రణబ్. ఆ తర్వాత దేశేర్ దక్ అనే ఓ బెంగాలీ పత్రికలో జర్నలిస్టుగా చేరారు.
అక్కడి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడటంతో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రగా, వాణిజ్య శాఖ మంత్రిగానూ ప్రణబ్ సేవలందించారు. భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించిన నేతగా పేరొందారు.
అంతే కాదు.. 1982 లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి… అత్యంత పిన్న వయసులో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తర్వాత 1987లో ప్రణబ్ సొంత పార్టీని స్థాపించారు. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించి… 1989లో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
2012 నుంచి 2017 వరకు ప్రణబ్ 13వ భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ఇప్పటికే భారత రత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ చేరారు.
ప్రణబ్ ముఖర్జీని 2008లోనే పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 2010లో బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఏషియా అవార్డును అందుకున్నారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ రాజకీయ వేత్త మాత్రమే కాదు.. ఆయనలో మంచి రచయిత ఉన్నాడు. ఆయన పలు పుస్తకాలను రాశారు. 1987లో ఆఫ్ ది ట్రాక్ అనే పుస్తకాన్ని రాశారు. 1992లో సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, చాలెంజెస్ బిఫోర్ ది నేషన్ అనే పుస్తకాలను రచించారు. 2014లో ది డ్రమాటిక్ డెకేడ్ : ది డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్ అనే పుస్తకాన్ని రచించారు.