స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనున్నది. 9 జిల్లాల్లో 12 స్థానాలకు నోటిఫికేషన వెలువడగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో బరిలో ఎవరూ నిలకవపోవడంతో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని ఆరుస్థానాలకు టీఆర్‌ఎస్ ఏకగ్రీవానికి ప్రయత్నించి విఫలం కావడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇందుకోసం శుక్రవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నిక జరుగుతుంది.
ఆరుస్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల కాకుండా తనకు బలం ఉన్న ఉమ్మడి ఖమ్మం, మెదక్ జిల్లాలో పోటీ చేస్తున్నది. తగినంత బలం లేకపోవడంతో స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ దూరంగా ఉన్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచారు.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులకు ఓటు హక్కు ఉన్నది. మొత్తం 5326 ఓట్లకు గాను టీఆర్‌ఎస్‌కే సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నది.
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ తరఫున దండె విఠల్, ఇండిపెండెంట్ బరిలో ఉండగా మొత్తం 939 ఓట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 717 ఓట్ల మెజారిటీ ఉన్నది.
కరీంనగర్‌లో రెండు స్థానాలకు ఎన్నిక జరగనున్నది. టీఆర్‌ఎస్ తరఫున భానుప్రసాద్‌రావు, ఎల్ రమణ పోటీ చేస్తుండగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ జిల్లాలో 1324 ఓట్లు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 996 ఓట్లు ఉన్నాయి.
ఖమ్మంలో టీఆర్‌ఎస్ తరఫున తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థులు శ్రీనివాసరావు, పుష్పరాణి ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 768 ఓట్లకు గాను టీఆర్‌ఎస్‌కు 490, కాంగ్రెస్‌కు 116 మంది ఓట్లు ఉన్నాయి.
మెదక్‌లో టీఆర్‌ఎస్ తరఫున వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. మొత్తం 1026 ఓట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 777, కాంగ్రెస్‌కు 230 ఓట్లు ఉన్నాయి.
నల్లగొండలో టీఆర్‌ఎస్ తరఫున ఎంసీ కోటిరెడ్డితోపాటు ఆరుగు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మొత్తం 1271 ఓట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 991 ఓట్లు ఉన్నాయి.