తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ భారీ కాన్వాయ్‌తో బెంగళూరు నుంచి తమిళనాడు చేరుకున్నారు. తన వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండానే పెట్టుకొని చెన్నైకు వస్తున్నారు . హొసూరు నుంచి రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ చెన్నైకి చేరుకుంటారు. ఆమెకు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నాయి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు. చిన్నమ్మకు చెక్ పెట్టడానికి తమిళ సర్కారు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్నికల వేళ అన్నాడీఎంకే పగ్గాలు మళ్లీ శశికళ చేజిక్కించుకుంటారా పార్టీ పై పట్టు సాధిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే, శశికళ మధ్య రోజుకో ట్విస్ట్ తో టెన్షన్ పుట్టిస్తున్నాయి. జయలలిత మరణించాక తమిళనాట అధికార అన్నాడీఎంకేలో విభేదాలు రచ్చకెక్కాయి. పన్నీర్ సెల్వం ఎదురుతిరగడంతో.. పళనిస్వామిని తెరపైకి తెచ్చారు శశికళ. సీఎం అయ్యాక పళనిస్వామి కూడా ఎదురుతిరగడంతో శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. జైలు జీవితం ముగించుకున్న శశికళకు ఈ ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ ఉంటుందో లేదోననే చర్చ..కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనున్నాదనేది ఆసక్తి కలిగిస్తోంది.
జయలలిత బ్రతికి ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన శశికళ.. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే జయలలిత మరణం తరువాత కూడా పార్టీ మొత్తాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్నారు. ఆయితే ఆ తరువాత చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెజార్టీ సభ్యుల తీర్మానంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మళ్లీ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. బెంగుళూరు నుంచి శశికళ కదులుంటే ఇటు అన్నా డీఎంకే లో ప్రకంపనాలు పుడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జయ పార్టీ నేతలు చాలామంది శశికళతో టచ్ లో ఉన్నారు. దీంతో పళని-పన్నీర్ ఇద్దరికీ టెన్షన్ పెరుగుతోంది.
అదే సమయంలో రెండాకుల గుర్తు తనకే చెందాలంటూ సుప్రీంని ఆశ్రయించారు శశికళ.అక్రమాస్తుల కేసులో 2017లో అరెస్టయిన శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అమ్మ మరణం తర్వాత తనదనుకున్న పార్టీనే.. తనను దూరం పెట్టటంతో శశికళకు పెద్ద అవమానమనే చెప్పాలి. దానికిపుడు ప్రతీకారం చూపే అవకాశం వస్తోంది. తన శక్తిని ప్రదర్శించి వచ్చే ఎన్నికలవైపు అడుగులు వేసే అవకాశం ఉందని అన్నాడీఎంకేలో శశికళ అభిమానుల వాదన. అందుకే చిన్నమ్మ తలుచుకోవడమే ఆలస్యం.. అన్నాడీఎంకేకి శశికళ సారధ్యం వహించాలని రాష్ట్రమంతా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఇంతకాలం అటు జయ లేక, ఇటు, శశికళ జైలు పాలవటంతో సైలెంట్ గా ఉన్నవారంతా ఇప్పుడు బయటపడుతున్నారు.
అయితే, జైలు శిక్ష అనుభవించిన శశికళ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆర్థిక నేరంపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు.జైలు శిక్ష అనుభవించి పోటీ చేసి, ముఖ్యమంత్రైన సిక్కిం నేత ప్రేమ్ సింగ్ దమాంగ్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు చిన్నమ్మ అభిమానులు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీలో చక్రం తిప్పేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలున్నాయి.
మరోపక్క దేశంలో ఒక్కో రాష్ట్రంలో పట్టుబిగించే ఎత్తుగడలు వేస్తున్న బిజెపి, తమిళనాడు ఎన్నికలపై దృష్టిపెట్టింది. అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట పాగా వేయాలనే వ్యూహంతో ఉంది కమలం పార్టీ. దీంతో.. శశికళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ పెరుగుతోంది.చిన్నమ్మ రీ ఎంట్రీతో తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుదనే చూడాలి..