ఢిల్లీ పీఠం కోసం ఆ రెండు పార్టీలు కొదమసింహాల్లా పోరాడుతున్నాయి.. ఆధిపత్యం కోసం ఒకరు.. జెండా పాతాలని ఇంకొకరు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.. మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నాలు చేస్తుంటే.. ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది.. దీంతో వింటర్ లోనూ.. ఢిల్లీ రాజకీయం హీటెక్కుతోంది..
వచ్చే ఏడాదిలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి.. మూడుసార్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంటే.. ఢిల్లీలో జెండా పాతాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది.. దేశంలోని మెజార్టీ స్థానాల్లో అధికారంలో ఉన్నా.. ఢిల్లీ పీఠం మాత్రం ఆ పార్టీకి కలగా మారింది.. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరో పక్క కాంగ్రెస్ కూడా ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.. చాలా ఏళ్లు ఢిల్లీని ఏలాం.. ఈసారి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ కూడా దృష్టి పెట్టింది..
ప్రధానంగా ఢిల్లీ సీఎం పీఠం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బిజేపీలు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బిజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది.. ఎన్నికల అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.. ఊరిస్తున్న ఢిల్లీని చేజిక్కించుకోవాలని మోడీ టీమ్ భావిస్తోంది.. వారి వ్యూహాలకు ధీటుగా ఆప్ కూడా.. వ్యూహ రచన చేస్తోంది.. బిజేపీని టార్గెట్ చేసుకుని. .ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా.. సింగిల్ గా కమలం పార్టీని ఢీకొట్టాలని చూస్తోంది..
1952 నుంచి ఇప్పటి వరకు ఏడుగురు సీఎంలు ఢిల్లీకి పనిచేశారు. కాంగ్రెస్ నుంచి బ్రహ్మ ప్రకాష్ మొదటి సీఎం కాగా.. 1993లో బిజేపీ నుంచి మదన్ లాల్ ఖురానా పనిచేశారు.. తర్వాత 1998 నుంచి 2003 వరకు షీలా ధీక్షిత్ ఎక్కువ కాలం కాంగ్రెస్ తరపున సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ కు తిరుగులేదని భావించిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ.. దాని దూకుడుకు బ్రేక్ వేసింది. 2013లో, 2015లో ఆప్ అధికారంలోకి వచ్చింది.. 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆప్ మరోసారి గెలిచి.. కాంగ్రెస్, బిజేపీని మట్టి కరిపించింది.. ఈసారి కూడా గెలవాలని ఆప్ చూస్తుంటే.. బిజేపీ మాత్రం చాపకిందనీరులా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..