జగన్.. మా బాధలు తీర్చరా..?

-

ఏపీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో నవరత్నాల హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆయన వాటి అమలుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన హామీ ఇవ్వని మరో రత్నంగా.. అగ్రిగోల్డ్ అంశాన్ని పదో రత్నంగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలంటున్నారు ఆ సంస్థ బాధితులు.

20 వేల రూపాయలు లోపు ఉన్న బాధితులకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో న్యాయం చేస్తామని ప్రతిపక్ష హోదా లో జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర రావు గుర్తు చేశారు. విజయవాడ దాసరి భవన్ లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో వాలంటీర్లు బాధితుల ఇళ్లకొచ్చి బ్యాంకులో జమ చేసిన సొమ్ము తాలూకు రశీదులు ఇస్తారని జగన్ చెప్పారన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. జిల్లా న్యాయ సేవ సమితిలో పేర్లు నమోదు చేసుకున్న 10 వేల రూపాయల లోపు డిపాజిట్ బాధితులు 4 లక్షల మంది ఉన్నారని.. సుమారు 270 కోట్లు మంజూరు చేస్తే వారికి న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 21 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు స్పందన కార్యక్రమం లో న్యాయం కోసం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలుపుతామన్నారు.

నవంబర్ 15 నాటికి బడ్జెట్ లో పేర్కొన్న నిధులు 1150 కోట్లు మంజూరు చేయాలి.. లేకుంటే నవంబర్ 18,19 తేదీల్లో 36 గంటల దీక్ష చేపడతామన్నారు. 6 మాసాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news