సాధారణంగా హార్ట్ ఎటాక్స్ అనేవి స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇకపై ఈ పద్ధతి మారనుందా ? అంటే.. అవుననే గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయట. అవును, సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైన నిజం ఇది. అమెరికాలోని ఆసుపత్రుల్లో గత 5 ఏళ్ల కాలంలో నమోదైన హార్ట్ ఎటాక్స్ కేసుల్ని పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుంది.
అమెరికాలోని హాస్పిటల్స్ లో చేరిన వారిలో గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కువగా 35 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సున్నవారికే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వచ్చాయట. అలాగే ఈ సంఖ్య 1995-99 మధ్య 27 శాతం పెరగ్గా, 2010-14 మధ్య ఆ శాతం 32 గా నమోదైంది. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు. ఇక వారిలో ఎక్కువగా మహిళలకే.. అందులోనూ యుక్త వయస్సులో ఉన్నవారికే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయట. జర్నల్ సర్క్యులేషన్‌లో ఈ వివరాలను ప్రచురించారు.
సాధారణంగా గుండె పోటు ఎవరికి వచ్చినా కొన్ని లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. కానీ పురుషుల విషయంలోనే అది జరుగుతుందట. స్త్రీలకైతే ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సడెన్‌గా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయట. 1995 నుంచి 2014 మధ్య కాలంలో 35 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న, హార్ట్ ఎటాక్స్ వచ్చి ఆసుపత్రుల్లో చేరిన 28,732 మంది రోగుల వివరాలను సైంటిస్టులు పరిశీలించి, ఆపై ఈ వివరాలను వెల్లడించారు.
కాగా అమెరికాలో ఏటా 7.90 లక్షల మంది హార్ట్ ఎటాక్స్ బారిన పడుతుండగా… ప్రపంచ వ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 85 శాతం మరణాలు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా సంభవిస్తున్నవే కావడం గమనార్హం. ఇక అమెరికాలో హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్న పురుషుల సంఖ్య తగ్గుతుండగా, స్త్రీల సంఖ్య మాత్రం పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్, హైబీపీ, అధిక బరువు, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి కూడా మహిళల్లో హార్ట్ స్ట్రోక్స్‌కు కారణమవుతుందని వారు తేల్చారు. కనుక స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉంటే హార్ట్ ఎటాక్‌ల బారిన పడకుండా ఉండవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.