తెలంగాణకు అమిత్‌ షా స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌.. ఏం జరుగుతోందంటే…!

-

బీజేపీ జాతీయ సారధి, కేంద్ర మంత్రి అమిత్‌ షా.. దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే కర్ణాటకలో కుమార ప్రభుత్వాన్ని కూలగొట్టి పార్టీ గద్దెనెక్కింది. ఇక, ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి కొంత మెరుగ్గా ఉన్న తెలంగాణపై ప్రత్యేకంగా అమిత్‌ షా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఇక్కడి నేతలకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. వారు ఏంచేస్తున్నారో తెలుసుకుంటున్నారు. ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు.

BJP Chief amit shah special Treatment On Telangana

ఈ క్ర‌మంలోనే షా కనుసన్నల్లో ఇక్కడి కమలం పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టి ఆయన పెట్టిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. వచ్చే 2024కు ముందుగానే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. అప్పటికల్లా బీజేపీని బలోపేతం చేసుకోవాలని కుదిరితే అధికారంలోకి వచ్చి తీరాలని లేకపోతే.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా చక్రం తిప్పాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన షా.. దీనికి సంబందించి ఇక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

దీనిలో భాగంగా ఆయన బీజేపీ సభ్యత్వ నమోదును ఉద్రుతం చేయాలని ఇక్కడి నేతలకు సూచించారు. గత నెలలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి తొలుత 12 లక్షల వరకు లక్ష్యాన్ని నిర్ణయించుకుని నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీలో చేరేవారిని ఆహ్వానిస్తున్నారు. అయితే, ఇది కూడా చాలదని, మన లక్ష్యం పెద్దదైనప్పుడు.. కృషి కూడా అదేవిధంగా ఉండాలని భావించిన షా.. తాజాగా తెలంగాణలో బీజేపీ సభ్యత్వ లక్ష్యాన్ని మరో ఆరు లక్షలకు పెంచి మొత్తంగా 18 లక్షల మందిని కొత్తగా పార్టీలోకి చేర్చాలని నేతలకు టార్గెట్‌ విధించారు. దీని ప్రకారం చేయాలంటే.. మరింతగా తాము కృషి చేయాల్సి రావడంతో ఇప్పుడు తెలంగాణలోని నాయకులు పొద్దు పొడవడమే ఆలస్యం అన్నట్టుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.

ప్రతి ఒక్కరినీ పార్టీలోకి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇక, త్వరలోనే ఇక్కడ అమిత్‌ షా పర్యటించనున్నారని సమాచారం. ఆయన స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని, పార్టీని ముందుకు నడిపించడంతోపాటు అవసరమైతే.. తనకు గుజరాత్‌లో ఉన్న ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసుకుని తెలంగాణలో తీసుకోవడంద్వారా మరింతగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మొత్తంగా షా.. టార్గెట్‌తో బీజేపీ తెలంగాణ నేతల్లో ఆనందం వ్యక్తమవుతున్నా.. సభ్యత్వ నమోదు విషయంలో మాత్రం చెమటలు పడుతున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news