అమిత్ షా.. ఇప్పుడు ఇండియాలో ఈ పొలిటీషియన్ కు ఎదురు లేదు. రాత్రికి రాత్రి పరిణామాలు మార్చేయడంలో అమిత్ షా సిద్ధహస్తుడు. మహారాష్ట్రలో ఒక్క రాత్రిలోనే సీన్ మార్చేశారు. తెల్లారితే ఉద్దవ్ ధాకరే సీఎం అవుతారని కలలు కంటున్న శివసేనకు .. లేచి చూసేసరికి ఫడ్నవీస్ సీఎంగా కనిపించారు. అలా మహారాష్ట్ర రాజకీయాలను అమిత్ షా అనూహ్యంగా మలుపు తిప్పారు.
మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అంతే మోడీ, అమిత్ షా చక్రం తిప్పేశారు. ఎన్సీపీని చీల్చేశారు. అజిత్ పవార్ ను తమవైపునకు లాక్కొన్నారు. రాత్రికి రాత్రి సీన్ పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజామున ఫడ్నవీస్ సీఎం కావడం జరిగిపోయింది.
అయితే.. శరద్ పవార్ మాత్రం మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం అని ఆయన ప్రకటించారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్ పవార్‌ని తాము సమర్థించడం లేదన్నారు. తాజా పరిణామాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోవడంతో మిత్రపక్షం శివసేనకు బీజేపీ భారీ షాక్ ఇచ్చినట్లయింది. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద మరోసారి సీఎం అయిన ఫడ్నవీస్ కు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, అమిత్ షాకు ఫడణవీస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.