అంధేరి ఉప ఎన్నికలో ఉద్ధవ్‌ వర్గానిదే విజయం..!

-

ముంబయిలోని అంధేరి ఈస్ట్‌ ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం గెలుపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్‌ను ఆయన విత్‌ డ్రా చేసుకున్నట్లు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలపకూడదన్న మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయానికి అనుగుణంగా తమ అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరించినట్లు తెలిపారు.

శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన అంధేరీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్‌ లట్కే కొన్ని నెలల కిందట మరణించారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య రితుజా లట్కేను ఉద్ధవ్‌ వర్గం పోటీకి నిలిపింది. బీజేపీ మద్దతుతో సీఎం అయిన శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. బీఎంసీ ఉద్యోగిని అయిన రితుజా రాజీనామాను నామినేషన్‌కు చివరి వరకు పెండింగ్‌లో ఉంచారు. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో చివరకు కోర్టు ఆదేశాలతో ఆమోదించారు.

అంధేరీ ఉప ఎన్నికలో శివసేన రెండు వర్గాలు నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్‌కు శివసేన షిండే వర్గం మద్దతుగా ఉంది. బీజేపీ అభ్యర్థిని పోటీ నుంచి విరమించాలని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే కోరారు. శివసేనను చీల్చి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ చివరకు వెనక్కి తగ్గింది. తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమించింది. దీంతో శివసేన ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థిని రితుజా లట్కే విజయానికి మార్గం సుగమం అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news