రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లోటు బడ్జెట్ లో పాలన మొదలు పెట్టిన చంద్రబాబు గత ఐదేళ్లు అప్పులతో రాష్ట్రాన్ని నడిపించుకుని వచ్చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ పాలన మొదలుపెట్టి ఆరు నెలలు అయిపోయింది. ఈ ఆరు నెలల్లో కూడా జగన్ అప్పుల మీదే రాష్ట్రాన్ని నడిపించారు. కేంద్రం నుంచి సాయం దక్కకపోవడంతో అప్పు చేసి మరి తన మేనిఫెస్టోలోని పథకాలని అమలు చేస్తూ వస్తున్నారు.
ఇక ఇప్పుడు పథకాలని అప్పులు చేసి ఎలాగోలా ప్రారంభించినా…. రానున్న నాలుగేళ్లలో కూడా వీటిని కొనసాగించాల్సిన అవసరముంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జగన్ తన మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలుకే సర్కారు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండడంతో సీఎం జగన్మోహన్‌రెడ్డితో పాటు మంత్రులకూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడానికి ఇతర మార్గాల నుంచి నిధులను అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఇటు రాష్ట్రంలో అనుకున్న మేర అభివృద్ధి లేకపోవడంతో ఆదాయం కూడా అంతంత మాత్రమే వస్తుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల తగ్గింపు, బార్లకు కొత్త విధానంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఇతర మార్గాల నుంచి వచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు సర్కారు మళ్లిస్తోంది.
దీంతో రాష్ట్ర ఖజానాకు ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ అధికారుల అంచనాల మేరకు మార్చి నాటికి ఆదాయ లోటు పెరుగుతుందని, ఏకంగా రూ.21వేల కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.
అలాగే ఈ ఏడాది చివరినాటికి కేవలం రూ.1,57లక్షల కోట్లు మాత్రమే ఆదాయం లభిస్తుందని తేల్చేశారు. బడ్జెట్ లో రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించినప్పటికీ కేంద్రం నిధుల్లో భారీగా తగ్గుదల ఉందని, మాంద్యం దెబ్బకు అన్ని రంగాల్లో ఆదాయం క్షీణించిందని తేలింది. పైగా సకాలంలో యుసీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కేంద్ర పథకాలతో సహా మిగిలిన పథకాలకు సంబంధించి దాదాపు రూ. 6339 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.
అయితే కొన్ని పథకాలకు బిల్లు చెల్లింపులు, పూర్తి కాకపోవడంతో యూసీలు సిద్ధం చేయడం కుదరలేదు. ఫలితంగా యూసీలు లేకపోతే కేంద్రం నుంచి వచ్చే బిల్లులు రావు. ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ రెండోవారం నాటికి రూ.21వేల కోట్లు ఆర్‌బిఐ ద్వారా బాండ్లు వేలంవేసి అప్పు తెస్తే ఈ ఏడాదికి ఇప్పటికే రూ. 24వేల కోట్లు తీసుకువచ్చారు. మరోవైపు రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయం రూ. 83వేల కోట్ల వరకు వస్తుందని భావించగా రూ.54వేల కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు.
అటు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు, గ్రాంట్లు, రాష్ట్ర పధకాలకు కేంద్ర సాయంగా వచ్చే నిధులు కలిపి రూ.96వేల కోట్ల వరకు వస్తుందని బడ్జెట్ లో ప్రతిపాదించారు. తాజా అంచనాల మేరకు అది రూ.50వేల కోట్లు మాత్రమే. అప్పుల రూపంలో రూ.46వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇటు రాష్ట్రంలో ఆదాయం రాక, అటు కేంద్రం నుంచి పన్నుల వాటా గానీ, పథకాల వాటా గానీ రాక రాష్ట్ర ఖజానా కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్ళు ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టమైపోతుంది.