ఓరుగల్లు రాజకీయాలను శాసించడమే కాదు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన కొండాదంపతులు ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇద్దరికీ పదవుల్లేకుండాపోవడమే కాకుండా… కూతురు సుస్మిత పటేల్‌కు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని భావించిన రాజకీయ దంపతుల స్వప్నం చెదిరిపోతుందేమోనన్న ఆందోళన పట్టుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఓరుగల్లు రాజకీయాల్లో సుధీర్ఘకాలంగా ఉంటూ వస్తున్న వీరు ప్రస్తుతం కాంగ్రెస్ కొనసాగుతున్నారు.
టీడీపీతో మొదలైన వీరి ప్రస్థానం అటు తర్వాత కాంగ్రెస్‌కు, వైఎస్సార్సీపీకి, అటు తర్వాత టీఆర్ ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి మారింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌లోకి మారిన వీరు తమ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేటీఆర్ యత్నిస్తున్నాడని భావించిన కొండా దంపతులు కేసీఆర్, కేటీఆర్, పార్టీపై తీవ్రంగా విరుచకుపడ్డారు. తమతో పాటు కూతురు సుస్మితకు భూపాలపల్లి టికెట్ కోరినా అధిష్ఠానం అంగీకరించలేదు. దీంతో పరకాల టికెట్‌తో సర్దుకోవాల్సి వచ్చింది.
అయితే అంతకు ముందు ఓరుగల్లులో తాము పోటీ చేసే పరకాలతో పాటు మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిచి చూపిస్తామని కొండా మురళి సవాల్ చేశారు. ఇవేవీ సాధ్య పడకపోగా చివరికి కొండా సురేఖ పోటీ చేసిన పరకాలలో ఘెరంగా ఓటమి పాలయ్యారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టన్నట్లుగా ఉంటున్న కొండా దంపతులు ప్రస్తుతం కండువా మార్చే పనిలో ఉన్నారని ఓరుగల్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరికి టికెట్ సాధించుకోవాలని కొండా రాజకీయ దంపతులు యోచిస్తున్నారట.
అయితే ఇందులో చాలా వరక అసత్యమే ఉందని, కావాలనే కొండా దంపతులు లీకులు ఇస్తున్నారని, అలా చేస్తే కాంగ్రెస్‌లో ప్రాధాన్యం పెరుగుతుందనే వ్యూహంతో ఉన్నారనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు. దీనికితోడు కొండా దంపతులు బీజేపీలో ఇమడలేరని, వారసత్వ రాజకీయాలు ఆ పార్టీలో ఏమాత్రం సాగబోవని కుండబద్ధలు కొడుతున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ నేతలు కొండా దంపతులు రాకుండా కావాల్సినన్ని చర్యలు కూడా ఇప్పటికే తీసుకున్నట్లు తెలుస్తోంది. సైలెంట్ మోడ్‌లో ఉన్న కొండా దంపతులు ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ మారుతారా..?! సర్దుకుని కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌లో ఉంటే అధిష్ఠానానికి కొన్ని షరతులు సూచించి పార్టీలో కొనసాగాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ కూతురు భవిష్యత్ కంటే తమకు ఏదీ ముఖ్యం కాదు అని వారు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. బీజేపీ లో చేరితే ప్రస్తుతం భూపాలపల్లిలో పార్టీ బలోపేతం కావడంతో ఆ సీటును తన కూతురుకి కోరాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కీర్తిరెడ్డి మంచి క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. ఆమెను కాదని సుస్మితాకు ఇస్తారా అంటే అది కోటి రూపాయల ప్రశ్నే అంటూ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.