వ్యతిరేక గళాలపై వేటు..బీజేపీ యూటర్న్ తీసుకుందా

-

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరెత్తితే వేటు వేసింది ఏపీ బీజేపీ. క్రమశిక్షణలో పెట్టడానికి ఇదే పరిష్కారమంటూ ఎక్కువ తక్కువ మాట్లాడిన వారికి పార్టీ పెద్దల ఆదేశాలతో నిమిషాల్లో నోటీసులు ఇచ్చారు. గంటల వ్యవధిలో వేటు వేశారు. అయితే అలంటి నేతల పై ఉన్న సస్పెన్షన్లను మళ్లీ బీజేపీ ఎత్తేస్తుందట..సడన్ గా బీజేపీ యూటర్న్ ఎందుకు తీసుకుంది అన్నదానిపై కమలం పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఏపీ బీజేపీలో ఒకప్పుడు సస్పెన్షన్ల పర్వం నడిచింది. కీలక అంశాలపై నేతలు తలో మాట మాట్లాడటం వల్ల పార్టీ నవ్వుల పాలవుతోందని భావించిన రాష్ట్ర నాయకత్వం అదే రేంజ్ లో చర్యలు తీసుకుంది. నెల రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో నేతల పై వేటు వేసింది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కేంద్ర జోక్యంపై మాట్లాడిన నేతలనే ఎక్కువ కార్నర్ చేసింది.

కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజాను సస్పెండ్‌ చేశారు. అనుమతి లేకుండా టీవీ చానళ్ల చర్చలకు వెళ్తున్నారన్నది లక్ష్మీపతిపై ఉన్న అభియోగం. దిలీప్‌, రామకోటయ్యలకు కూడా నోటీసులు ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. సమాధానం చెప్పాలని నోటీసుల్లో కోరారు. ఇప్పుడు ఏపీ బీజేపీ సారథిగా సోము వీర్రాజు వచ్చారు. అమరావతి విషయంలో ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యలు పార్టీ విధానం కాదని ఎంట్రీలోనే కౌంటర్‌ ఇచ్చారు వీర్రాజు.

టీవీ చర్చా కార్యక్రమాల్లో దినకర్ పార్టీ నిర్ణయాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ..ఆ విషయంపై తొలుత లంకా దినకర్ కు షోకాజ్ నోటీసు జారీ అయింది. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేసింది. బిజెపిలో చేరడానికి ముందు లంకా దినకర్ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయాక బీజేపీలో చేరారు.

ఇప్పుడు సడన్ గా దినకర్ పై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తేసింది బీజేపీ అధిష్టానం. దీని వెనుక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల లాబీయింగ్ పని చేసిందా అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. సస్పెన్షన్ కి గురైన మిగిలిన నేతలకు కూడా ఇదే థిరీ వర్తిస్తుందా వారి పై ఉన్న సస్పెన్షన్లను కూడా ఎత్తేస్తారా అన్న చర్చ ఇప్పుడు కమలనాథుల్లో ఆసక్తి రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news