ఏపీ బీపీ : ఆ ఎమ్మెల్సీ ని తొల‌గిస్తారా ?

ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం అనుమానాస్ప‌ద  మృతి అన్న‌ది వివాదాల‌కు తావిస్తోంది. దీనిని హ‌త్య కిందే భావించాల‌ని మంత్రి  మేరుగ నాగార్జున కూడా తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక‌లు కూడా ఇదే నిర్థారించాయి. ఆయ‌న‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా జ‌రిపిన భౌతిక దాడి ఫ‌లితంగానే ప్రాణాలు కోల్పోయార‌ని నివేదిక‌లు తేల్చాయి.
ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం అయ్యారు అని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత‌బాబును వైసీపీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కొంద‌రు ప‌ట్టుబడుతున్నారు. ఆయ‌న్ను త‌క్షణ‌మే అరెస్టు చేయాల‌ని బ‌హుజ‌న ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి వేడుకుంటోంది. వెంట‌నే ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి ఆయ‌న్ను తొల‌గించాల‌ని కూడా కోరుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్ర‌కారం డ్రైవ‌ర్ ను ఇసుక‌లో కుక్కి, కొట్టి చంపార‌ని నిర్థార‌ణ చేసింద‌ని, నిందితుల‌ను డీజీపీ ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు సంబంధిత బ‌హుజ‌న ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ప్ర‌తినిధులు.
మ‌రోవైపు పోస్టు మార్టం రిపోర్టు అంద‌గానే ఎమ్మెల్సీ పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని డీజీపీ అంటున్నారు. ఇదే స‌మ‌యంలో అనంత‌బాబు పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎందుకు డిలే అవుతున్నాయ‌ని ద‌ళిత సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. మంత్రులు మాత్రం వేర్వేరుగా స్పందిస్తూ ఉన్నారు ఈ ఘ‌ట‌న‌పై.. ! త‌ప్పు చేయలేదు అన్న ధైర్యంతోనే ఎమ్మెల్సీ ఆ విధంగా బ‌య‌ట తిరుగుతూ ఉండ‌వ‌చ్చ‌ని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఘ‌ట‌న జ‌రిగిన రోజునే మృతుడి భార్య , ఇత‌ర కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చి ఉంటే, ఈ పాటికే అరెస్టు అయి ఉండేవార‌ని అంటున్నారీయ‌న.
ఇవ‌న్నీ ఎలా ఉన్నా బాధిత వ‌ర్గాల‌కు అండ‌గా ఉండేందుకు  విప‌క్ష పార్టీలు ముందుకు వ‌చ్చాయి. టీడీపీ అధినేత  చంద్ర‌బాబు ఇప్ప‌టికే బాధితుల‌తో మాట్లాడి, పార్టీ త‌ర‌ఫున ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ ప‌రారీ విష‌య‌మై ఇప్ప‌టికీ ఓ స్ప‌ష్ట‌త ఎందుకు రావ‌డం లేదు అని పోలీసుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు ప‌సుపు పార్టీ పెద్ద‌లు.
మంత్రుల‌లో కొంద‌రు త‌లోర‌కంగా మాట్లాడ‌డం కూడా కేసు కొంత ప‌క్క‌దోవ ప‌ట్టేందుకు కార‌ణ‌మేనని అంటున్నారు టీడీపీ పెద్ద‌లు. ఏ విధంగా చూసుకున్నా  ఇవాళ కానీ రేపు కానీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాల్సిందేన‌ని పట్టుబడుతున్నారు.