ఆన్ లైన్ టిక్కెట్ల విధానానికే వాళ్లే కారణం : బయట పెట్టిన ఏపీ ప్రభుత్వం..!!

అమరావతి : సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని వివరించారు. పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందని… బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చామని… ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం పై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు మంత్రి పేర్ని నాని. దీని పై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారని… దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దని ఎద్దేవా చేశారు.

2002 ఏడాదిలో ఈ ఆన్ లైన్ సిస్టం ద్వారా సినిమా టిక్కెట్లను అమ్మించే ప్రయత్నం చేయండని కేంద్రాన్ని కోరామని… పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయన్నారు. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను అమ్మొచ్చని గత ప్రభుత్వం నిర్ణయించిందని…. దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపిందని స్పష్టం చేశారు. ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదని… ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలని హితువు పలికారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగనుతో భేటీ కానున్నారని ఆయన తెలిపారు.