*ఎంవీఎస్ మూర్తి స్మృతివనం ఏర్పాటుకు వెయ్యి గజాల ప్రభుత్వ భూమి కేటాయింపు
* 250 ఎకరాల సొంత భూమున్న మూర్తికి ప్రభుత్వ భూమి కేటాయింపు అవసరమా?
* పేదవాడు 100 గజాలు అడిగితే ఇవ్వని ప్రభుత్వం అత్యంత సంపన్నునికి ఆఘమేఘాలపై కేటాయింపు
*మార్కెట్ రేటుకే కొన్నామంటూ మూర్తి కొడుకు రామారావు సమర్థింపు
అమరావతి: ఎంవీఎస్ మూర్తి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, వైజాగులో ఉన్న కుబేరుల్లో ఒకరు. గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు. గోల్డ్‌స్పాట్ కూల్‌డ్రింక్ కంపెనీ అధినేత. ఒక్క వైజాగులోనే సుమారు 250 ఎకరాల సొంత భూములున్న అపర కోటీశ్వరుడు, హీరో నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెను తన మనువడికి పెళ్లి చేసుకున్న వివిఐపి. అలాంటి ఎంవీఎస్ మూర్తి ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్ ను హైర్ చేసుకున్న ధనవంతులు వారు. కానీ ఆయన మృత దేహాన్ని ఖననం చేయడానికి ఆరు గజాల స్థలం కరువైంది. 250 ఎకరాల సొంత భూముల్లో ఆయనను పూడ్చడానికి ఆరు గజాలే దొరకకుండా పోయింది. అంతే ఆఘమేఘాలపై ప్రభుత్వం విశాఖలో గీతం యూనివర్శిటీకే ఆనుకుని ఉన్న అత్యంత విలువైన వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని ఎంవీఎస్ మూర్తి స్మృతి వనం ఏర్పాటు చేయడానికి కేటాయించేసేంది.
ఈ వార్త బయటకు తెలిసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతోమంది పేదలు ఏళ్లకు ఏళ్లుగా జానెడు ఇంటి స్థలం కోసం వందల అర్జీలు పెట్టుకుని, వేల సార్లు అధికారులు, ప్రజానిధుల చుట్టూ తిరుగుతున్న కనికరం చూపని చంద్రబాబు ప్రభుత్వం.. అత్యంత స్థితిమంతుని అంత్యక్రియలకు వెయ్యి గజాలను ఆఘమేఘాలపై కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నవారు కొందరైతే, చంద్రబాబు దగుల్బాజీ పాలన తీరుకు ఇది మచ్చు తునక అని మరికొందరు ఏకిపారేస్తున్నారు. ఇటీవలే మంత్రి యనమల రామకృష్ణుడు పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసుకుంటే 2 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం… దాన్ని మరచిపోకముందే నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గని ఎంవీఎస్ మూర్తి స్మృతి వనానికి 1000 గజాలు కేటాయించి మరోసారి నవ్వులపాలైంది. 250 ఎకరాలు సంపాదించిన తండ్రి స్మృతి వనానికి 1000 గజాలు కేటాయించలేని మూర్తి కొడుకు రామారావు… ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తామని చెప్పడం వింతగానే ఉంది.