జగన్ కు చెప్పడంరాలేదు… హైకోర్టు చెప్పింది!

-

ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షాల దృష్టంతా వినాయకచవితి ఉత్సావాలపై ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ పేరుచెప్పి హిందూవ్యతిరేక విధానాలను జగన్ అవలంభిస్తున్నారని.. హిందూవ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ, జగన్ తో పూర్తిగా విభేదించగా.. ఆ పార్టీవెనకాలే మిత్రపక్షం జనసేన, మిత్రపక్షం కావాలనుకుంటున్న టీడీపీ కొనసాగింపిచ్చాయి. అయితే ఈ విషయాలపై తాజాగా హైకోర్టు స్పందించింది.

ఏపీలో వినాయకచవితి ఉత్సవాల విషయంలో జగన్ సర్కార్ తో ఏపీ హైకోర్టు సగం ఏకీభవించింది! ఫలితంగా ఇటు ప్రతిపక్షాలకు – అటు ప్రభుత్వానికి బేలెన్స్డ్ గా హైకోర్టు తీర్పు వచ్చినట్లయ్యింది! ఇటు ప్రభుత్వం నిర్ధేశించిన కొన్ని ఆంక్షలతో ఏకీభవిస్తూనే.. ప్రతిపక్షాల డిమాండ్ లకు కొన్ని సానుకూల సూచనలు చేసింది. అయితే… అటు జగన్ సర్కార్ చెప్పినా.. ఇటు హైకోర్టు చెప్పినా… కోవిడ్ నిబంధనలు మాత్రం మేండేటరీ!

ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాల విషయంలో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని ప్రజలకు తెలిపింది.

ఈ సందర్భంగా ఆర్టికల్ 26ను ప్రస్థావించిన హైకోర్టు… ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని, ఆ హక్కును నిరోధించే హక్కు ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. అయితే కోవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని.. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని ప్రజలకు హైకోర్టు సూచించింది. ఇదేక్రమంలో పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది.

ఇవే విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చెప్పేవిషయంలో జగన్ సర్కార్ విఫలమయ్యింది. ఒకపక్క రాజకీయ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.. పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు.. రాత్రి 11గంటలవరకూ బయట తిరిగే స్వేచ్చ ఉంది.. వర్థంతులూ – జయంతులూ కూడా గట్టిగానే జరుగుతున్నాయి.. బార్లు – సినిమాహాళ్లు తెరుచుకున్నాయి.. స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ కూడా… పూర్తిస్థాయి నిషేదాజ్ఞలు ఇవ్వకుండా – ఇలా బేలెన్స్డ్ గా స్పందించి ఉంటే బాగుండేది! అలా కాకుండా పూర్తిగా నిషేదించినట్లు చేయడంవల్ల… అటు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడంతోపాటు – హిందుత్వ వ్యతిరేకి అనే పేరును సంపాదించుకుంది!

ఈ తీర్పుతో జగన్ సర్కార్ కి కాస్త కనువిప్పు కలగాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఈ పండగ విషయంలో జగన్ పెట్టిన కండిషన్స్ కి దాదాపుగానే హైకోర్టు స్పందించింది! అయితే… చెప్పిన విధానంలో క్లారిటీ ఉంది.. సమన్యాయం ఉంది.. సమతుల్యత ఉంది! కానీ… జగన్ సర్కార్ కి చెప్పడం రాలేదు.. ఫలితం – వినాయకచవితి ఉత్సవాలకు రాజకీయ రంగు అంటుకుంది!

Read more RELATED
Recommended to you

Latest news