ఏపీ పెద్దల సభ ఇక “పెద్దలకు మాత్రమే”!

-

బూతులు తిట్టుకోవడంతోపాటు ఒకరినొకరు నెట్టుకున్నారు.. ఎగిరెగిరి తన్నుకున్నారు.. అరుపులు, కేకలతో హాలుని రణరంగంగా మార్చారు.. సెక్షన్‌ సిబ్బంది పరుగులు తీశారు.. వృద్ధులు ఆందోళనకు గురై ఎక్కడివారక్కడ కూర్చుండిపోయారు.. అనంతరం పలువురు సభ్యులు బయటకొచ్చి వణికిపోయారు.. ఈ రణరంగం మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఇవన్నింటినీ ఒక వ్యక్తి షూట్ చేస్తూ ఉన్నారు.. ఏమిటి ఇవన్నీ? ఎక్కడ? ఎందుకు? అసలు ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసేలా ఉన్న ఈ సంఘటనలు అన్నింటికీ ఒకేసారి వేదికైంది ఏపీ శాసన మండలి.. అదే పెద్దల సభ!

పెద్దల సభ అంటే… 150 కిలోల బరువు ఉండి బుడబుక్కలోడిలా తయరయ్యి వచ్చే వారు ఉండే సభ కాదని.. టీడీపీ నేతలను ఉద్దేశించి వైకాపా నాయకులు అన్నా… గెడ్డాలు పెంచుకుని వస్తున్నారు అని వైకాపా నాయకులను ఉద్దేశించి టీడీపీ నేతలు విమర్శించినా… వీరిద్దరూ కలిసిన ఏపీ పెద్దల సభమాత్రం రణరంగంగా మారింది. వీటన్నింటికీ కారణంగా నిలిచాయి రెండు బిల్లులు! వాటిలో ఒకటి.. సీఆర్‌డీఏ రద్దు, రెండోది.. వికేంద్రీకరణ బిల్లు!

ఈ సందర్భంలోనే మంత్రులు, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే! ఈబిల్లులు ఎందుకు ఆపుతున్నారో టీడీపీ సభ్యులకు క్లారిటీ ఉందని… ఇవి అమలు అయితే అమరావతిలో అడ్డంగా కొన్న భూములు అమ్ముకోవచ్చని, సేఫ్ అవ్వొచ్చని చూస్తున్నారని వైకాపా నేతలు అంటే… ముందు వైజాగ్ పారిపోవాలని చూస్తున్నారని టీడీపి నేతలు అంటున్నారు.

విమర్శలూ ప్రతివిమర్శల సంగతి అలా ఉంటే… వీటన్నింటికీ మూలం.. లోకేశ్ సెల్ ఫోన్ పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీయడం అని అంటున్నారు కొందరు సభ్యులు! అలాంటి సభాహక్కుల ఉల్లంఘన పనులు చేయొద్దని లోకేశ్ కు వైకాపా నేతలు చెప్పే ప్రయత్నంలో, ఆ ఫోన్ ని లాక్కునే ప్రయత్నాలు కూడా జరిగాయని.. వాటిని లోకేష్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారని అంటున్నారు వైకాపా నేతలు! సభలో ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీయడం సభా హక్కుల ఉల్లంఘన అనే విషయం కూడా తెలియని మొద్దు బాబును చంద్రబాబు పెద్దల సభకు పంపారని విమర్శలు గుప్పించారు.

ఈ సమయంలో తమ మహిళా సభ్యుల దగ్గరకు వచ్చి.. షర్ట్ బటన్ తీసి, ఫ్యాంట్ జిప్పు తీసి అసభ్యకరంగా మాట్లాడారని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనిపై స్పందించిన అనీల్… ధమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలని, స్పీకర్ వద్ద వీడియోలు తీసుకుని, నిరూపించలేని పక్షంలో తమ పదవులకు రాజినామా చేస్తామని రాసివ్వమని టీడీపీ ఎమ్మెల్సీలకు సవాల్ విసిరారు. దీనిపై టీడీపీ నేతలు మౌనం వహించారు!

ఏది ఏమైనా… ఆదర్శప్రాయంగా ఉంటారు.. అనుభవం వల్ల వచ్చిన ఆలోచనలతో నిండి ఉంటారు.. శాసన సభలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. వాటిని పెద్ద మనసుతో ఆలోచించి సలహాలు సూచనలు ఇస్తారని రూపొందించిన పెద్దల సభ.. రోజు రోజుకీ “పెద్దలకు మాత్రమే” అన్న సినిమాలాగా తయారయ్యిందని పలువురు విమర్శిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news