ఉత్తర్ ప్రదేశ్ లో నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన ఎంపీ, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ లో ఎంపీ అసదుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాడి అనంతరం కేంద్రం ఇవ్వజూపిన జెడ్ కేటగిరీ భద్రతను వద్దంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. యూపీలో నిన్న జరిగిన దాడి గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారు. నేను చావుకు భయపడేవాడిని కాదంటూ వ్యాఖ్యలు చేశారు. కాల్పలు జరిపిన వారిని శిక్షించాలని కోరారు. వాళ్లు ఎవరు.. వాళ్లు తూటాలపై విశ్వాసంతో ఉన్నారని.. బ్యాలెట్ పై విశ్వాసం లేదని అన్నారు. నేను సాధారణ పౌరుడిలా ఏ కేటగిరీలోనే ఉంటానని అన్నారు. రైట్ వింగ్ టెర్రరిజం పెరుగుతుందని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు. ఘటనపై విచారణ జరగుతుందని అన్నారు. సోమవారం ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి లోక్ సభలో మాట్లాడుతారని తెలిపారు.