సర్వం జ్ఞాన మయం
కొందరికి సర్వం కాఫీమయం
ఎక్కడో పుట్టి ఇక్కడకు చేరడం
వింతైన ప్రయాణం
పెదవి దాకా ఆ ప్రయాణం వచ్చి చేరడమే
ఉదయ కాల అనుభూతి!
కాఫీతో జీవితం ప్రారంభించే జీవులు కొన్ని వార్తలకు,విశేషాలకు అనుబంధంగా ఉండి ఉంటారు.కానీ వార్తలు లేదా విశేషాలు ఏవీ అనుబంధాలను పెంచడం లేదు.కేవలం అవి సమాచారం ఇచ్చి వెళ్తున్నాయి.వార్తలు అన్నవి భావోద్వేగాలు కావు కేవలం కొన్ని మాటల కూడిక మాత్రమే! పత్రికలు ఎప్పుడో తప్ప భావోద్వేగాలను ఇవ్వవు.కేవలం సమాచారం మాత్రమే ఇస్తాయి.కాఫీ కప్పు ఆ సమాచార స్రవంతి నుంచి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలో చెబుతుంది.కడివెడు పాలు జీవితం,గుప్పెడు కాఫీ పొడి దాంట్లో కలిపిన మరో జీవితం రెండు జీవితాలు కలిసి పంచదార తీరంలో తేలితే..కప్పు కాఫీ కాక ఇంకేం అవుతుంది.జీవితాన్ని అర్థవంతం చేసుకోవడంలో ఉన్న బాధ్యతను కప్పు కాఫీతోనే ప్రారంభించండి.
ఏం చెప్పినా ఏం చేసినా ఒక చోట విశ్రాంత స్థావరం వెతుక్కోవడం తప్పని సరి! ఇంగ్లీషులో ఏమంటారు దానిని రిలాక్సియేషన్ పాయింట్ అనే కదా! అక్కడ ఉదయాలను హాయిగా అనుభవించాలి..ఉదయ కాల సంవర్తనలు గమనించాలి. కాలం చెప్పే ఊసులు వింటూ ఉండాలి. ఉదయాలు ఏమయినా మార్పునకు సంకేతం అయి ఉన్నాయో లేదో కూడా చూడాలి. ఇవాళ వీలుంటే కప్పు కాఫీ ఎవరితో! ప్రియురాలి తో! లేదా జీవిత భాగస్వామితో! తప్పక పంచుకోండి.
కాఫీ కప్పు నుంచి జీవితం ఆరంభం అవుతుందని ఆనదం ఆరంభ స్థానాలు అవే అని ఎందరో చాలా సార్లు అంటుంటే విన్నాను. లోకం నడవడిని కప్పు కాఫీ నుంచి చూడడం అంచనా వేయడం అన్నవి కష్టమే కానీ ఆ వేడి ఘుమ ఘుమల మధ్య లోకాన్ని అర్థం చేసుకోవడం మాత్రం సులువు.కప్పు కాఫీతో రాజకీయాలు..కప్పు కాఫీతో సినిమాలు..కప్పు కాఫీతో ఏమయినా.. సంగతులు అన్నీ పంచుకుని ఉదయాలను ఫస్ట్ పేజ్ వార్తలకు పరిమితం చేయకుండా మీరు ప్రయాణించండి.
నెవర్ ఎండింగ్ డీటైల్స్ కొన్ని ఉంటాయి.అవి ప్రేమ సంబంధితాలు అయి ఉంటాయి. కొన్ని భక్తి సంబంధితాలు అయి ఉంటాయి. దేవుడు అనే ఈ పదం కూడా నెవర్ ఎండింగ్ డీటైలే కదా! కానీ మనం గుర్తించడం లేదు. దేవుడు..మనిషి..వాడి ప్రేమ ఇవన్నీ కప్పు కాఫీ తో స్ఫురణకు వస్తున్నారా? మనిషి మాత్రం ప్రతి ఉదయాన్ని తన కోసమే అనుకోవడం ఓ పెద్ద బాధ్యత.. ఆ బాధ్యతను సరిగా మోయాలి..మోహావేశాలకు అతీతంగా మోయగలగాలి.కాలాన్ని మోయడం బాధ్యత..మన కాలాన్ని ఇతరుల కాలాన్ని కలిపి ప్రయాణించడమే కష్టం.కప్పు కాఫీ మెట్రోస్టేషన్లలో.. కప్పు కాఫీ క్యూబికల్ సర్కిల్స్ లో..
– డైలాగ్ ఆఫ్ ద డే – మనలోకం ప్రత్యేకం