తెలుగుదేశం పార్టీలో ఆగష్టు టెన్షన్‌.. కలవర పడుతున్న తెలుగుతమ్ముళ్ళు

-

ఆగష్టు నెల వచ్చిందంటే చాలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు ఒకింత కలవరపాటుకి గురవుతుంటారు.దీనికి ఓ కారణం కూడా ఉంది.పార్టీ ఆవిర్భావం నుంచి అంతర్గతంగా చోటుచేసుకున్న మార్పులు,వివాదాస్పద నిర్ణయాలు,పార్టీకి నష్టం కలిగించేలా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ఈ నెలలోనే జరగడం తెలుగుతమ్ముళ్ళ టెన్షన్‌కు కారణం. తెలుగుదేశం పార్టీని ఇంతలా ఆందోళనకు గురిచేస్తున్న అంత సీరియస్‌ మ్యాటర్‌లు ఏంటి….ఆగష్టు నెలలోనే ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి….అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు అప్పటి సినీనటులు నంతమూరి తారక రామారావు.1983లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టింది. ఏపీకి సీనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో వైద్యం కోసం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో నాదెండ్ల భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేశారు. కేవలం నెలరోజులు మాత్రమేఆయన సీఎంగా ఉన్నారు. అమెరికా నుంచి తిరిగివచ్చిన ఎన్టీఆర్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ సంఘటన ఎన్టీఆర్‌కి ఆగష్టు సెంటిమెంట్‌గా మిగిలిపోయింది.ఆ తరువాత ఇదే ఆగష్టు నెలాఖర్లో ఎన్టీఆర్‌ నుంచి పార్టీ పగ్గాలను లాక్కున్నారు ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు. ఇలా రెండుసార్లు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని ఆగష్టు నెలలోనే కోల్పోయారు.ఇక అప్పటి నుంచి ఆగష్టు నెల వచ్చిందంటే ఏమి జరుగుతుందోననే టెన్షన్‌ టీడీపీ నేతల్లో పాతుకుపోయింది.ఎన్టీఆర్‌ మరణించాక కూడా ఆగష్టు నెల టీడీపీ నేతలకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీకి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన మాయనిమచ్చగా మిగిలిపోయింది.ఇది ఆగష్టు నెలలోనే జరగడం విశేషం.ఈ ప్రభావం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 2019లో అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆగష్టు అనుభవాలు పార్టీని వెంటాడాయి. తెలుగుతమ్ముళ్ళ టెన్షన్‌కు కారణం ఇలాంటి చాలా సంఘటనలు జరగడమే.

ఈ సారి ఆగష్టులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోననే కలవరం మొదలైంది తెలుగుదేశం పార్టీలో. అసైన్డ్‌ భూముల కుంభకోణం విషయంలో ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ఈ నెల 10వ తేదీన హైకోర్టు తుది విచారణ జరుపనుంది.ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీల మధ్య పొత్తుల విషయంపై కూడా ఈ నెలలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రాజెక్టుల సందర్శన పేరుతో 10 రోజుల పాటు ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబునాయుడు.భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంతో పాటు మహిళలతో మహాశక్తి ప్రచార రథం కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమాల ప్రభావం పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందోనని టెన్షన్‌ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news