మంత్రి అవంతి స్పీడుకి అధిష్టానం బ్రేకులేసిందా ?

-

అవంతి శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఎన్నికల ముందే పార్టీ మారినప్పటికీ కమ్యూనిటీ సహా వివిధ ఈక్వేషన్లు కలిసి రావడంతో అనూహ్యంగా కేబినెట్ ఛాన్స్‌ కొట్టారు. విశాఖజిల్లాలో ఏకైక మంత్రి కావడంతో తన హవాను చాటుకునేందుకు ప్రయత్నించారు అవంతి. పదవిలోకి వచ్చిన తర్వాత శాఖా పరమైన వ్యవహారాలకంటే రాజకీయ దూకుడుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

టీడీపీపై విరుచుకుపడ్డం ద్వారా వైసీపీ అధిష్ఠానం దగ్గర మైలేజ్ సంపాదించేందుకు ప్రయత్నించారు అవంతి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన వేసిన కౌంటర్లు అనేకసార్లు రాజకీయ వేడిని రాజేశాయి. మంత్రి పేల్చే మాటల తూటాలు టీడీపీ పెద్దలకు నేరుగా తగులుతుండటంతో ఆ ఒరవడిని కొనసాగించింది వైసీపీ. మంత్రి సైతం ఆ స్పీడ్‍, జోష్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడేవారు. అయితే ఒకప్పటి మిత్రుడు.. ప్రస్తుత రాజకీయ ప్రత్యర్ధి గంటా శ్రీనివాసరావువైపు మాటల దాడిని మళ్లించారు అవంతి. మీడియా ముందైన.. బహిరంగ వేదికలపైనైనా గంటాపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయాలను రసకందాయంలో పడేసేందుకు ప్రయత్నించేవారు. దీంతో జిల్లా పూర్తిగా అవంతి గ్రిప్‌లోకి వచ్చేసిందనే భావన సొంతపార్టీలోనే కనిపించింది.

జిల్లా రాజకీయాల్లో అవంతి హవా కొనసాగుతుందని భావిస్తుండగా.. ఒక్కసారిగా ఆ మూడ్ మారిపోయింది. ప్రస్తుతం మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ వ్యవహారాలు భీమిలికే పరిమితం. కోవిడ్ తర్వాత ఆయన ఫోకస్ అంతా నియోజకవర్గంపైనే ఉంది. అధికారులతో రివ్యూలు, విస్తృత సమావేశాలు అడపాదడపానే జరుగుతున్నాయి. అన్నింటికీ మించి టీడీపీ అధినేత చంద్రబాబుపైన అవంతి విమర్శలు ధాటి తగ్గిందనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ప్రతిపక్షనాయకుణ్ణి కడిగేయడానికి ఉత్సాహం ప్రదర్శించే మంత్రి ఇప్పుడు నిర్మాణాత్మక విమర్శలకు పరిమితం అవుతున్నారనే చర్చ జరుగుతోంది. అమరావతి, రెఫరెండం వంటి హాట్ హాట్ పొలిటికల్ ఇష్యూస్‌లోనూ ఆయన ధోరణి మారిందనేది మాటలను బట్టి తెలుస్తోంది. రొటీన్ వ్యాఖ్యలు, విమర్శలు తప్ప పంచ్‌లు మిస్సయ్యాయి.

టీడీపీలో ఐదేళ్లు పనిచేసిన నాయకుడిగా.. అక్కడ లోటుపాట్లు, వైఫల్యాలు తెలిసినప్పటికీ మంత్రి అవంతి ధీటుగా స్పందించడం లేదనేది చర్చ. ఇప్పుడు మంత్రి ఏం మాట్లాడినా అది పార్టీ లైన్, హైకమాండ్ ఆదేశాలకు లోబడే ఉంటున్నాయనేది వినికిడి. ఈ పరిస్థితిలో మార్పులకు కారణం ఏమై ఉంటుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవంతికి రాజకీయంగా జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పటికీ.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై అసంతృప్తి ఉందనేది టాక్‌.

ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూముల స్వాధీనం.. ప్రొటోకాల్ విషయాల్లో మంత్రి అంవతి కొంత అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది. భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువ శాతం భూముల వివాదాలు నడుస్తున్నాయి. యంత్రాంగం ఫోకస్ అంతా అక్కడే ఉంది. చాలా నిర్ణయాలు మంత్రిగారి నోటీస్‌కు రాక మునుపే అమలులోకి వచ్చేస్తున్నాయి. వీటిపై బహిరంగంగా స్పందించలేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం ఉందనేది నిజం. మరి.. అవంతి ఎన్నాళ్లిలా ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news