ఈనెల 28 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని వివరించారు. ‘బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలి.. తెరాస గెలవాలని కేసీఆర్ చెబుతున్నారు’ అని అన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లను ఏ చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనంటే వెళ్తారనే అర్థమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని తెలంగాణకు తీసుకువచ్చింది ఎవరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేరు చెబితే కేసీఆర్ మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీల నాయకులు అమ్ముడుపోతే కార్యకర్తలు బీజేపీలో చేరండని సూచించారు. మోదీ సభతో కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ యుద్ధం చేసినా తాము సిద్ధమని.. కేసీఆర్ కంటే ముందే యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు.. అదే తమ లక్ష్యమని బండి సంజయ్ వివరించారు.