వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను తెచ్చిందో అందరికీ తెలిసిందే.ఈ యాత్రలో జగన్ తో కలిసి నడిచిన ప్రజలు ఏకపక్ష నిర్ణయంతో వైసీపీకి అధికార పీఠాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఇలాంటి యాత్రతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను కవర్ చేస్తూ వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. మరో నెలరోజుల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ యాత్రకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేశారు.
ప్రజాహితo కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా సంజయ్ యాత్ర కొనసాగనుంది.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే ఈ పాదయాత్ర అంతిమ లక్ష్యం.ఈనెల 10వ తేదీన కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర తొలివిడతలో వేములవాడతో పాటు సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరుగనుంది.సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
గతంలో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది.ఇప్పుడు చేపడుతున్న యాత్ర ద్వారా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చాలన్నదే బండి సంజయ్ సంకల్పం. పాదయాత్ర చేసిన ప్రతిఒక్కరు ప్రజలకు చేరువ అవుతున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. 2017లో పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.ఇదే తరహాలో బండి సంజయ్ సైతం ప్రజల్లోకి వెళ్లి బలమైన ఓటుబ్యాంకును సొంతo చేసుకునేందుకు విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర బండి సంజయ్ తలరాతను మారుస్తుందేమో చూడాలి మరి.