ఇలా అయితే ప‌వ‌న్ ఎమ్మెల్యే అయినా అవుతాడా…!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులు ఎంత బలమో… అదే అభిమానులు అంత మైనస్ గా మారుతున్నారు. వాస్తవానికి పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన సభల‌కు వ‌చ్చిన జనాలను చూసి అందరూ అశ్చ‌ర్య‌పోయారు. చిరంజీవి అధికారంలోకి వచ్చి సీఎం అవుతారని అందరూ భావించారు. రెండు చోట్ల‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిరంజీవి సొంత జిల్లా పాల‌కొల్లులో ఓడి… తిరుపతిలో గెలిచారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన సభలకు సైతం భారీగా యువ‌త తరలివచ్చారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ భీమవరం, గాజువాక రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారు.

ఈ లెక్కన చూస్తే పవన్ అభిమానులు పవన్ కు మైన‌స్ అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన సభలకు వచ్చే వాళ్లలో ఎలాంటి అవగాహన లేని యువత మాత్రమే ఎక్కువగా వస్తున్నారని… వీరంతా పవన్‌ను సినిమా హీరోగా చూసి ఎంజాయ్ చేసేందుకు మాత్ర‌మే వ‌స్తున్నార‌ని… పవన్ మాట్లాడుతుంటే ఈల‌లు మాత్రమే వేస్తున్నారని…. అంతకుమించి వీరికి పవన్ చెప్పే ప్రసంగం ఒక ముక్క కూడా అర్ధం కావట్లేదు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ యువ‌త‌కు వారి భ‌విష్య‌త్తు లేదా.. రాష్ట్ర భ‌విష్య‌త్తు.. రాజ‌కీయాల‌పై అంత అవ‌గాహ‌న ఉండ‌దు.. జీవితంలో ఎంజాయ్ ద‌శ‌లో ఉంటారు. అందుకే వీళ్లు ప‌వ‌న్‌ను ఓ హీరోగా చూస్తున్నారే త‌ప్ప రాజ‌కీయ నాయ‌కుడిగా చూడ‌డం లేదు. ఇదే ప‌వ‌న్‌కు పెద్ద మైన‌స్ అవుతోంది.

ఇక ఇప్పుడు వీళ్ల చ‌ర్చ‌లు ప‌వ‌న్‌కే విసుగు తెప్పిస్తున్నాయి. గ‌తంలో చాలా సార్లు ప‌వ‌న్ మాట్లాడుతుండ‌గా విజిల్స్‌తో ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని అడ్డుకోవ‌డంతో ప‌వ‌న్ వాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆదివారం ప‌వ‌న్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో మాట్లాడారు. రైతు కష్టం నుంచి మరింత కష్టాల్లోకి వెళ్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చుపెడుతున్నారని.. రైతును ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు.

ఈ క్ర‌మంలోనే ఈ స‌భ‌కు ప‌వ‌న్ అభిమానులు, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ప‌వ‌న్ ఏం చెపుతున్నాడో ? ఎవ్వ‌రికి అర్థంకాని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే వారిపై తీవ్ర అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌న్ జనసైనికులకు క్రమశిక్షణ లేకే ఓడిపోయానని.. రైతుల గురించి మాట్లాడుతుంటే ఈ కేక‌లేంట‌ని ఫైర్ అయ్యారు. నిజంగా మీరు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండి ఉంటే జ‌న‌సేన గెలిచేద‌ని పవన్‌ మండిపడ్డారు. మ‌రి నిజంగా ఇలాంటి కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ రాజ‌కీయం చేస్తే ఆయ‌న సీఎం కాదుక‌దా.. కనీసం ఎమ్మెల్యే అయినా అవుతారా..?

Read more RELATED
Recommended to you

Latest news