చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్‌: ఆకుమ‌ర్తి – అనిల్ – రోష‌న్‌.. బీ ఫామ్ ఎవ‌రికంటే..?

-

ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ / టిక్కెట్ ప‌ద‌వికి ఎవ‌రికి వ‌స్తుంద‌న్న దానిపై దాదాపు రెండేళ్లుగా స‌స్పెన్స్ సాగ‌దీత‌గా వ‌స్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టిక్కెట్ కోసం ఓ 15 + మంది నేత‌లు సాలువాలు, బొకేలు ప‌ట్టుకుని బ‌య‌లు దేరారు. ఫైన‌ల్‌గా రేసులో ముగ్గురే మిగిలారు. కులాల స‌మీక‌ర‌ణ‌లు, ఆర్థికాంశాల నేప‌థ్యంలో ఈ ముగ్గురిలో ఒక‌రికి టిక్కెట్ ద‌క్క‌డం ఖాయం. ఆ ముగ్గురు నేత‌లు ఎవ‌రో కాదు జంగారెడ్డిగూడెం ప‌ట్ట‌ణానికి చెందిన సీనియ‌ర్ నేత ఆకుమ‌ర్తి రామారావు, లింగ‌పాలెం మండ‌లానికి చెందిన సొంగా రోష‌న్‌కుమార్‌, మ‌రో నేత బొమ్మాజీ అనిల్‌. వీరిలో అనిల్ సోద‌రుడు సంత‌నూత‌ల‌పాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజ‌య్‌కుమార్‌.. ప్ర‌స్తుతం అదే నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జ్ కూడా..!

వీరి ముగ్గురు నేత‌ల‌ విష‌యానికి వ‌స్తే ఆకుమ‌ర్తి రామారావు ఎవ‌రికి అయినా అజాత శత్రువే. పార్టీకి కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న సేవ‌లు అందిస్తూనే వ‌స్తున్నారు. నారా లోకేష్ సేవా స‌మితి ప్రారంభించి పార్టీ కార్య‌క‌ర్త‌లు, నిరుపేద‌ల‌కు ఎన్నో సేవ‌లు అందించారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాల కోసం ఆయ‌న్ను వాడ‌ని వారు ఉండ‌రు. 2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న‌కు సీటు రావాల్సి ఉన్నా చివ‌ర్లో పీత‌ల సుజాత‌కు అదృష్టం క‌లిసొచ్చింది. 2019లోనూ ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ట్రై చేసినా సీటు ద‌క్క‌లేదు.

మ‌హేంద్ర ట్రాక్ట‌ర్ షోరూమ్ డీల‌ర్‌గా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ్రామంలోనూ పార్టీలు, వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయి. చిన్న ఊర్ల‌లో కూడా ఆయ‌న పేరు పెట్టి పిలిచే వాళ్ల సంఖ్య ( సాధార‌ణ పౌరులు) 20కు త‌క్కువ కాకుండా ఉంటుంది. మృదుస్వ‌భావిగా కూడా ఆయ‌న‌కు పేరుంది. రామారావుకు సీటు ఇస్తే మా ఓటు కూడా ఆయ‌న‌కే అనే ఇత‌ర పార్టీల ఓట‌ర్లు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో మంది ఉన్నారు. చింత‌ల‌పూడి మాదిగ సామాజిక వ‌ర్గానికి ఇస్తే రామారావు బెట‌ర్ ఆప్ష‌న్ అనే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. స్థానికంగా ఉంటార‌న్న పేరు ఉండ‌నే ఉంది. అయితే ఆర్థిక వ‌న‌రుల్లో మిగిలిన ఇద్ద‌రితో పోలిస్తే కాస్త వెన‌క‌బాటు చిన్న మైన‌స్‌.

ఇక ఖ‌చ్చితంగా సీటు మాల సామాజిక వ‌ర్గానికి ఇస్తే బొమ్మాజీ అనీల్ త‌ప్పా వేరే ఆప్ష‌నే లేదు. దీంతో పాటు నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్ అయినా పై స్థాయిలో విస్తృత ప‌రిచ‌యాలు.. ఆర్థిక బ‌లం పుష్క‌లంగా ఉండ‌డం, అటు సోద‌రుడు మాజీ ఎమ్మెల్యే కావ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతుండ‌డం, నియోజ‌క‌వ‌ర్గం చుట్టుప‌క్క‌ల ఈ కుటుంబానికి ఉన్న కాలేజ్‌లు, స్నేహితులు ప్ల‌స్‌. ఆర్థికంగా అనిల్‌కు మిగిలిన వారెవ్వ‌రూ స‌రితూగే ఛాన్సే లేదు. పై స్థాయిలో బ‌ల‌మైన నెట్ వ‌ర్క్, లాబీయింగ్ కూడా టిక్కెట్ కేటాయింపులో చాలా ప్ల‌స్ కానుంది. ఉమ్మ‌డి జిల్లాలో కొవ్వూరు, గోపాల‌పురం మాదిగ వ‌ర్గానికే ఇస్తోన్న నేప‌థ్యంలో చింత‌ల‌పూడి మాల‌కు ఇవ్వాల్సి వ‌స్తే అనిల్‌కు బీ ఫామ్ గ్యారెంటీ..!

ఇక మ‌రో నేత సొంగా రోష‌న్‌కుమార్‌. ఎన్నారై అయిన రోష‌న్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో చారిట‌బుల్ ట్ర‌స్ట్‌తో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ టిక్కెట్ కోసం ట్రైచేసి త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. లింగ‌పాలెం మండ‌లానికి స్థానికుడు కావ‌డం.. ఒక‌రిద్ద‌రు జిల్లా, రాష్ట్ర స్థాయి నేత‌ల అండ‌దండ‌లు ఉండ‌డం, ఆర్థికంగా ఓ మోస్త‌రు బ‌లంగా ఉండ‌డం..ఆయ‌న‌కు ప్ల‌స్‌. మ‌రి ఈ ముగ్గురు నేత‌ల్లో చింత‌ల‌పూడి టీడీపీ బీ ఫామ్ ద‌క్కించుకునే ఆ అదృష్ట‌వంతుడు ఎవ‌రో చూడాలి. ఇక ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెడుతూ వ‌స్తోన్న అధిష్టానం త్వ‌ర‌లోనే చింత‌ల‌పూడి ఇన్‌చార్జ్ పంచాయితీ కూడా తేల్చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news