అయోధ్య వివాదం బిజెపికి ఏ విధంగా కలిసి వచ్చింది…? బిజెపి బలపడటానికి ఆ పరిణామమే కారణమా…?

-

మతాలకు రాజకీయ పార్టీలు ఉండటం కొత్త కాదు గాని… హిందుత్వ మతానికి ఉన్న భారతీయ జనతా పార్టీ నేపధ్యమే ఆసక్తిగా ఉంటుంది. హిందువుల మద్దతుగా ఆర్ ఎస్ ఎస్, జనతా పార్టీల్లో పని చేసిన నాయకులు స్థాపించిన బిజెపి రెండు సీట్ల నుంచి నేడు 3౦3 సీట్లకు వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం… హిందుత్వమే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు బిజెపికి సహకరించడానికి, ప్రచారం చేయడానికి హిందుత్వమే కారణం. మరి ఈ పార్టీకి రామ జన్మభూమిగా చెప్తున్న అయోధ్య ఏ విధంగా ఉపయోగపడింది. నేడు ఆ పార్టీ బలపడటానికి ఏ విధంగా కారణం అయింది…?

బిజెపి బలపడటానికి ప్రధాన కారణం అయోధ్యే అనేది రాజకీయ పరిశీలకుల మాట. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా లేదని భావించిన హిందుత్వ వాదులు బిజెపికి మద్దతు పలికారు. దీనిని బిజెపి సమర్ధవంతంగా వాడుకుందని అంటారు. బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని… పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చెయ్యాలని భావించారు.

10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న, అయోధ్య చేరుకోవాలని భావించినా అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ దీనికి బ్రేకులు వేసారు. ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచడంలో అయోధ్య వివాదం కీలకంగా వ్యవహరించింది. యాత్ర సగంలో ఆగిపోయినా సరే… అద్వాని కృషి బిజెపిని బలోపేతం చేసింది అనేది వాస్తవం. 92 లో అద్వానినే స్వయంగా బాబ్రీ కూల్చివేతలో ఉండటం కూడా బిజెపికి బాగా కలిసి వచ్చింది. అక్కడి నుంచి క్రమంగా పార్టీ బలపడింది.

బిజెపి ఆ తర్వాత అధికారంలోకి రావడానికి హిందువుల మద్దతే కారణం. అయితే 2004 లో అధికారం కోల్పోయిన తర్వాత, అద్వాని లక్ష్యంగా ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండలేక మాజీ ప్రధాని వాజపేయి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2014 లో రామమందిరాన్ని బిజెపి నిర్మిస్తుంది అనే ప్రచారాన్ని హిందుత్వ సంస్థలు బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాయి. 2019 లో బిజెపి అధికారంలోకి రావడానికి గానూ రామ మందిరాన్ని ఎక్కువగా వినియోగించుకుంది. ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే నిర్మాణం జరుగుతుందని భావించారు. ఈ విధంగా బిజెపి బలపడటానికి అయోధ్య కీలకమైంది.

Read more RELATED
Recommended to you

Latest news