టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్న విషయం తెలిసిందే..ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దించి..తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని కమలదళం చూస్తుంది. ఈ క్రమంలోనే తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బీజేపీ నేతలు వదులుకోవడం లేదు…కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతి అస్త్రాన్ని వాడుకుంటుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు…కేసీఆర్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. సాలు దొర, సెలవు దొర అనే స్లోగన్ తో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నారు. అలాగే ఆర్టీఐ చట్టం ద్వారా దాదాపు 80 పైనే అప్లికేషన్లు పెట్టి…కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న లొసగులని బయటపెట్టేందుకు చూస్తున్నారు.
ఇక సాలు దొర సెలవు దొర అంటూ పాటలతో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైన తీరుని ప్రజలకు వివరించనున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, 24 గంటల ఉచిత విద్యుత్, బెల్ట్ షాపులు, పోడు భూముల సమస్యలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితబంధు అమలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఉచిత ఎరువులు, ఫీజు రీఎంబర్స్మెంట్, చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు..ఇలా ఒకటి ఏంటి అనేక సమస్యలని బీజేపీ ఎత్తిచూపనుంది. ఎనిమిదేళ్ళ కేసీఆర్ పాలనపై పెద్ద పోరాటం చేయనుంది.
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటిని రాజకీయ అస్త్రాలుగా మలిచి…కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయనుంది. అయితే ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర పెద్దలు ఇచ్చిన సలహాలు సూచనలతోనే రాష్ట్ర బీజేపీ నేతలు దూకుడుగా ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నాటికి కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కమలనాథులు పనిచేయనున్నారు.