పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించిన కేసులో నిన్నటి వేళ మాజీ మంత్రి నారాయణ అరెస్టు అయ్యారు. ఈ కేసుకు సంబంధించి నైతిక బాధ్యత వహించి మంత్రి బొత్స రాజీనామా చేయాలని విపక్షాలు ఎంతగానో పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుల దగ్గర నుంచి ఇంకా ఇతర నిందితుల వరకూ అందరినీ పూర్తి స్థాయిలో విచారించి, నిజానిజాలు వెలుగులోకి తీసుకుని రావాలని వేడుకుంటున్నారు. మరి ! ఇది సాధ్యమేనా ! ఓ వైపు ప్రశ్న పత్రాల లీకు లేనేలేదని చెబుతూనే, మరోవైపు అప్పటి మంత్రి నారాయణ ఈ కేసులో ప్రధాన నిందితుడు అని పేర్కొంటూ నిన్నటి వేళ బొత్స నాలుగు మాటలు ఎక్కువే చెప్పారు. నారాయణ విద్యా సంస్థలకు అధినేతగా ఉన్న మాజీ మంత్రి నిర్వాకం కారణంగానే ఇదంతా జరిగిందని అంటున్నారాయన. ఇవన్నీ ఎలా ఉన్నా సమగ్ర దర్యాప్తు అన్నది ఈ కేసు విషయంలో ఆశించవచ్చో లేదో అన్నది మంత్రి బొత్స చెబితే బాగుండు.
వాస్తవానికి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొట్టమొదటి పరీక్షలు ఇవే ! కరోనా కారణంగా రెండేళ్లు ఎవ్వరికీ ఏ చదువులూ లేవు. ఏ పరీక్షలూ లేవు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఎటువంటి వివాదాలకూ ఆస్కారం లేకుండా నిర్వహించి తమ సమర్థతను నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది ! కానీ ఎందుకనో పరీక్షలు మొదలయిన రోజు నుంచి ప్రశ్న పత్రం లీకులకు సంబంధించి చిత్తూరు మొదలుకుని అనేక ప్రాంతాల మీదుగా వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వైసీపీ నాయకులే ఇందుకు కారణం అని టీడీపీ ఆరోపిస్తూ, అందుకు తగ్గ వాట్సాప్ సోర్సులను సైతం చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది.
ప్రశ్న ఏమయినా సరే సమాధానం మాత్రం ఒక్కటే అన్న విధంగా బొత్స కూడా నడుచుకున్నారు. పోటీ పరుగుల్లో భాగంగా ఒకనాడు లీకేజీల సమస్యలు విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కూడా అవే అందుకు కారణం కావొచ్చు. చాలా కాలం తరువాత వెలుగు చూసిన ఈ దుష్ట సంస్కృతికి కారకులు ఎవ్వరు ? ఆ రోజు పరీక్షల నిర్వహణపై ఎన్ని మాటలు చెప్పారు. వాటిని పాటించిన దాఖలాలు ఏమయినా ఉన్నాయా అన్నది విపక్షం ప్రశ్న.