విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణ ఖరారు అయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ టీడీపీ నేత మాజీమంత్రి కళా వెంకట్రావ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నిక ముగిసి రెండు నెలలు కూడా గడవకముందే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతున్నారు బొత్స. స్థానిక సంస్థల్లో వైసీపీకి సంపూర్ణబలం ఉండటంతో బొత్సను రంగంలోకి దింపుతున్నారు జగన్.
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా పలువురు నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కూటమి తరపున ఇంకా అభ్యర్ధి ఖరారు కాకపోయినా విజయంపై ధీమాగా ఉంది. వైసీపీకి మరోసారి ఓటమి రుచి చూపించాలని కూటమి నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 16 వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఆయన పైన వేటు వేయటంతో ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యి ఎన్నిక అనివార్యమైంది.స్థానిక సంస్థల్లో ఓట్ల పరంగా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లతో పాటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 మంది.ఎన్డిఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజెపీలకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీ పోలింగ్ లోపు 500 మంది ఓటర్లు కూటమి పార్టీల్లోకి చేరితే కానీ మెజారిటీ సాధించలేవు.ఇంత తక్కువ సమయంలో అంతమంది ఓటర్లు కూటమివైపు వెళ్తారా అంటే కాస్త అనుమానించాల్సిన విషయమే.కానీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. విశాఖకు చెందిన కార్పోరేటర్లతో పాటుగా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీకి పూర్తి బలం ఉండటంతో అందరూ సమన్వయంతో పని చేసి విజయం సాధించాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతోనూ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్ది ఎంపిక పైన వారి అభిప్రాయాలు సేకరించారు. నేతలు వెల్లడించిన అభిప్రాయాల మేరకు బొత్సా పేరును అధికారికంగా ఖరారు చేశారు జగన్. ఈ ఎన్నికలో గెలుపునకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. మొన్నటి ఎన్నికల్లో బొత్సా సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.
అయినప్పటికీ సంఖ్యబలం పరంగా గెలిచే అవకాశాలు ఉండటంతో బొత్స అయితేనే కూటమిని ఢీకొట్టగలడని ఆయన్ని రంగంలోకి దింపారు జగన్. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపును కూటమి.. వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా గెలవాలనే పట్టుదలతో బొత్స ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలు, మాజీమంత్రులు ఇప్పటికే విశాఖలో మకాం వేసి ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్తపడుతున్నారు.