చాలా రోజులకు తన తీరు భిన్నంగా బొత్స వ్యవహరించి మళ్లీ వార్తల్లో నిలిచారు. వాస్తవానికి ఎప్పటి నుంచో రెవెన్యూ శాఖకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తులన్నవి పెండింగ్ లో ఉండిపోతున్నా కూడా తహశీల్దార్లు పట్టించుకోవడం లేదన్నది ప్రధాన అభియోగం. మ్యుటేషన్ ప్రాసెస్ అన్నది సక్రమంగా జరగడం లేదని, రికార్డుల్లో పేరు మార్పు అన్నది కూడా అవినీతి కారణంగా సునాయాసంగా జరిగిపోతుందని సాక్షాత్తూ మంత్రులే ఒప్పుకుంటున్నారు. మొన్నటి వేళ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా అమాత్యునిగా పదవీ బాధ్యతలు అందుకున్న తరువాత మొదటి సారి జెడ్పీలో నిర్వమించిన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఇవే విషయాలు చెప్పారు. పత్రికల్లో వచ్చే వార్తలను ఓ ఛాలెంజ్ గా తీసుకుని, అప్రతిష్ట కు తావివ్వకుండా పనిచేయాలని అధికారులకు హితవు చెప్పారు. ఇప్పుడు ఇదే మాట బొత్స కూడా చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు చెప్పినా సరే రూల్ పొజిషన్ చూసుకునే పనిచేయాలని స్పష్టమయిన ఆదేశాలు నిన్నటి వేళ ఇచ్చారు. రూల్ పొజిషన్ కు భిన్నంగా పనిచేయకూడదని, ఆ విధంగా చేస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ తీరే విలక్షణం. పదవి ఉన్నా లేకపోయినా ఆయన ఎక్కడున్నా సంచలనమే ! ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్ గా ఇంతకాలం ఆయన ఎన్నో పదవులు అలకరించి ఉన్నారు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగి ఉన్నారు. అయినప్పటికీ ఇవాళ్టికీ కొన్ని విషయాల్లో ఆయన రాజీ పడరు. కొందరికి దూరంగా ఉంటూనే రాజకీయం నడిపే శక్తి ఉన్న నేత ఆయన. ఇంతవరకూ ఓ విధంగా విజయనగరంలోనే తిరుగులేని నేత. ఉత్తరాంధ్రను ప్రభావితం చేయగల నేత కూడా ! నాటి వైఎస్ కు ఇప్పటి జగన్ కు పాలనలో ఎంతో తేడా ఉన్నా తన పని తాను చేసుకుని పోవడంలో మాత్రం ఏ పాటి తేడా వచ్చినా సహించని నేత. పాలకులు వేరయినంత మాత్రాన తానెందుకు మారిపోవాలి అన్న తీరుకు తార్కాణంగా నిలిచే నేత. విజయనగరం జిల్లాలో తనకు కానీ తన వారికి కానీ ఏ పాటి చిన్న ఇబ్బంది వచ్చినా సహించని నేత. కొన్ని సందర్భాల్లో నేరుగా వైఎస్ తో తలపడ్డారు. కొన్ని సందర్భాల్లో నేరుగా జగన్ తో వాగ్వాదం పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయన తన శైలి మార్చుకోరు. వివాదాలలో ఉండేందుకు ఎక్కువ మొగ్గు చూపుతారు. మాట కారణంగానే ఆయన పరువు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నా కూడా జిల్లాలో ఆయన చరిష్మాకు మాత్రం లోటుండదు అన్నది వాస్తవం.
ఇక విజయనగరం జిల్లాలో ఇప్పుడు మరింత జోరుగా ఆయన పనిచేస్తున్నారు. గతం కన్నా వేగంగా పనిచేయడమే కాదు కాస్త వాస్తవిక దృక్పథంతో మాట్లాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ తహశీల్దార్ కు వార్నింగ్ ఇచ్చారు. చీపురు పల్లి తహశీల్దార్ సురేశ్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు చెబితే కానీ చేయరా అని నిన్నటి వేళ ప్రశ్నిస్తూ.. ఎంపీపీ లు చెప్పారనో, జెడ్పీటీసీలు చెప్పారనో చేసుకుంటూ పోతే మీ ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. మేము లేనిపోనివి చెప్పామని మీరు చేసుకుంటూ వెళ్తే అటుపై మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. చీపురుపల్లి (బొత్స సొంత నియోజకవర్గం) లో నిన్న
మండల సర్వసభ్య సమావేశం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించి మ్యుటేషన్ విషయమై దరఖాస్తుదారులు రోజుల తరబడి
ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఇది సబబు కాదని అభిప్రాయపడ్డారు. అందరి తహశీల్దార్లతో ఓ సమావేశం ఏర్పాటు చేసి వీటిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో ఇప్పుడీ మాట జిల్లా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
బొత్స తన తీరుకు భిన్నంగా మాట్లాడడం ఒకటి, రెండు.. ప్రజా ప్రతినిధులు కన్నా ప్రజలే మిన్న అన్న అర్థం వచ్చే విధంగా
మాట్లాడడం.. ఈ రెండు విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తావిస్తున్నాయి.