హ్యాట్రిక్‌ విజయం కోసం బీఆర్‌ఎస్‌ వ్యూహం

-

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లోక్ సభ స్థానంపై ఫోకస్ పెంచాయి కాంగ్రెస్‌,బిఆర్‌ఎస్‌ పార్టీలు.ఈసారి ఎలాగైనా ఓరుగల్లు ను తిరిగి కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ గెలుపు వ్యూహాలపై నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం వరంగల్ ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించాలంటే ఈసారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థి ని బరిలోకి దింపే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు కమలనాథులు.

కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు సిద్ధమైంది.వరంగల్‌లో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు కేసిఆర్‌. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవోకగా గెలిసిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఈసారి పరాభవం తప్పదని ప్రచారం జరుగుతోంది.మరీ ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారు..? ఎవరికీ ఈ సీట్ కట్టబెట్టబోతున్నారు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది.ప్రస్తుతం ఐదుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.. వారిలో ముఖ్యంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి స్వప్న, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి JAC నాయకుడు జోరిక రమేష్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ కల్పన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వీరిలో ఎవరిని నిలబెట్టినా ఎన్నికల ఖర్చు పార్టీ అధిష్టానమే భరించాల్సి వస్తుండడంతో వీరిలో బలమైన అభ్యర్థి ఎవరు అనే అంశాన్ని తేల్చే పనిలో పడ్డారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.ఎవరి వైపు ఓరుగల్లు ప్రజలు ఉన్నారు అనే దానిపైన సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.ఈసారి కూడా బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విక్టరీ అందిస్తారా..? లేక అధికార కాంగ్రెస్ పార్టీకి ఓరుగల్లు పార్లమెంటు సీటు కట్టబెడతారా..? లేదంటే బీజేపీని ఇక్కడ నుండి గెలిపించి కాషాయ జెండా ఎగురవేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తకరంగా మారింది.మరి ఓరుగల్లు ప్రజలు ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news