న్యాయ రాజధానిపై స్పష్టత
ఓవిధంగా తాము అనుకున్నదే
మరో విధంగా వెనక్కు తగ్గని వైనానికి
తార్కాణమిదే! ఇదే ఇప్పటి వైసీసీ వ్యూహం
ఛలో కర్నూలు .. అంత సులువా !
న్యాయ రాజధాని పేరిట హైకోర్టు భవనాల తరలింపునకు
మార్గం అంత సులువా !
రాజధాని గొడవ ఇప్పట్లో తీరేలా లేదు. ఉగాదులు ఎన్ని వచ్చినా కోయిల గానాలు ఎన్ని రకాలుగా మారినా ప్రభుత్వం తీరుపై మాత్రం ఇప్పట్లో స్పష్టత వచ్చేలా లేదు. 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి మళ్లీ పాత పాటనే అందుకుంటున్నారు జగన్.
మరి! ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన నిర్మాణాలు, ఖర్చు చేసిన 3 వేల కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలేంటి అని అడిగితే మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ప్రజా ధనం వృథా అయినా సరే కోర్టు వ్యవహారాలు అడ్డుకున్నా సరే తాము మాత్రం 3 రాజధానులు కట్టే తీరుతామని మళ్లీ మళ్లీ చెబుతున్నారు.
ఇదే దశలో రాజధాని రైతులకు మాత్రం న్యాయం చేస్తామని మాట మాత్రంగా చెప్పి తప్పుకుంటున్నారే కానీ వారిని ఏ విధంగా ఆదుకుంటారో అన్నది మాత్రం నిర్థిష్టంగా చెప్పడమే లేదు. అంటే అమరావతిని శాసన వ్యవహారాలకు పరిమితం చేసి, మిగిలిన పనులు అన్నీ నిలుపుదల చేయాలన్న ఆలోచనకు మరింత ఊతం ఇచ్చే విధంగానే రానున్న రోజుల్లో వైసీపీ పాలన కానీ పాలన సంబంధ నిర్ణయాల అమలు కానీ ఉండనుందని తేలిపోయింది.
ఈ దశలో.. మళ్లీ రాజధాని టాపిక్ తీసుకుని వచ్చారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. న్యాయ రాజధాని కర్నూలే అని తేల్చేశారు. ప్రభుత్వ అనుమతులు అన్నీ వచ్చిన తరువాత హై కోర్టు భవనాలన్నింటినీ కర్నూలుకు తరలిస్తామని చెబుతున్నారు. రాయల సీమపై ఉన్న మమకారంతోనే ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు ఎదురు అయినా సరే న్యాయ రాజధాని ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు రాష్ట్రంలోనే రెండో జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారని నిన్నటి వేళ కర్నూలులో తెలిపారు.