ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో ముందుకి వెళ్ళడం కష్టమా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. మండలిలో బిల్లు పాస్ కానీయని తెలుగుదేశం ఇప్పుడు జగన్ ని ఇబ్బంది పెట్టె అవకాశాలు కనపడుతున్నాయి. మంగళవారం బిల్లు పాస్ అవుతుందని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. బిల్లులను ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది పడింది.
అనుకున్న విధంగా తెలుగుదేశం పార్టీ రూల్ 71 విషయంలో తన పంతం నెగ్గించుకుంది. శాసనమండలిలో రూల్ 71 మీద చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీడీపీకి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. మొత్తం 32 మంది టీడీపీ సభ్యులు కాగా, ఒకరు రాజీనామా చేశారు. ఇద్దరు వ్యతిరేకంగా (పోతుల సునీత, శివనాద్ రెడ్డి) ఓటు వేశారు.
ఇద్దరు (శమంతకమణి, శత్రుచర్ల) సమావేశానికి రాలేదు. ఇక బుధవారం చర్చ జరిగినా, ఓటింగ్ జరిగినా సరే మండలిలో వైసీపీ గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితి. అయితే తెలుగుదేశం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇతర సభ్యులు కూడా తమకు అండగా నిలబడే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.