బాబు టార్గెట్ ఆ మంత్రి.. రీజ‌నేంటి…?

-

రాజ‌కీయాల్లో టార్గెట్లు, ప్ర‌తిటార్గెట్లు.. కామ‌నే! అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసేందుకు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్ర‌తిపక్షంలో ఉన్న చంద్ర‌బాబు కూడా అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే, బాబు వైఖ‌రి చూస్తుంటే.. కొన్ని రోజులుగా ఆయ‌న కేవ‌లం ఒక శాఖ‌ను, ఒకే ఒక మంత్రిని టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అదే రాష్ట్ర హోం శాఖ‌. పోలీసుల తీరుపై నిప్పులు వ‌ర్షం కురిపిస్తున్నారు చంద్ర‌బాబు. రోజుకో ర‌కంగా పోలీసుల‌పై కామెంట్లు చేస్తున్నారు.

అధికార పార్టీకి ఖాకీలు దాసోహం అయిపోయార‌ని, అధికార‌ పార్టీ నేతల్లా మారారని కూడా బాబు దుయ్య‌బ ట్టారు. విపక్షాల హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు దాదాపుగా ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నారు. ఇక విశాఖలో జరిగిన మీటింగులో అయితే ఏకంగా పోలీసులను వైసీపీలో చేరిపొమ్మ న్నారు. ప్ర‌మోష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డి పోలీసులు ఇలా చేస్తున్నారంటూ బాబు వ్యాఖ్యానించారు. అయితే, ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక చంద్ర‌బాబు వైఖ‌రి ఏంటి? ఆయ‌న వ్యూహం ఏంటి ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఆయ‌న టార్గెట్ అంతా కూడా మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌పైనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌గ‌న్ సార‌ధ్యంలోని ప్ర‌భుత్వంలో మేక‌తోటి సుచ‌రిత రాష్ట్ర హోం శాఖ ప‌గ్గాలు స్వీక‌రించారు. అయితే, ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుంటూరు జిల్లాలో ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా పార్టీ ఉనికి కి కూడా ప్ర‌మాదం ఏర్ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆత్మ‌కూరు ఘ‌ట‌న నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు, గుంటూరు జిల్లాలో టీడీపీ ఇబ్బందుల్లో ఉంది. కీల‌క నాయ‌కులు త‌మ‌పై ఉన్న కేసులు మ‌ళ్లీ ఎక్క‌డ బుస‌లు కొడ‌తాయోన‌ని భ‌య‌ప‌డి.. గ‌డ‌ప కూడా దాట‌డం లేదు.

వీరిలో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు కీల‌కంగా ఉన్నారు. అదేవిధంగా ఓడిన తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌. ఇప్ప టికే ఆత్మ‌హ‌త్య చేసుకున్న మాజీ స్పీక‌ర్ వంటి వారు ఉన్నారు. కోడెల కుంటుంబం గ‌తంలో చేసిన త‌ప్పు ల‌కు ఇప్ప‌టికీ కేసులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. దీంతో చంద్ర‌బాబు స‌హ‌జంగానే ఇదంతా కూడా జిల్లాలో ఆధిప‌త్యం కోసం మంత్రి సుచ‌రితే.. పోలీసుల‌ను ప్ర‌యోగిస్తున్న‌ట్టు అనుమానిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు నిత్యం పోలీసుల‌పై టార్గెట్ చేస్తూ.. మ‌హిళా మంత్రి విఫ‌ల‌మ‌య్యార‌ని, లేదా ప్ర‌భుత్వ‌మే శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసింద‌ని ఆరోపిస్తున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. గుంటూరులో పార్టీ దెబ్బ‌తింటున్న అక్క‌సు చంద్ర‌బాబు ఇలా తీర్చుకుంటున్నార‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news