టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరి అంచనాలకు అందవు. ఎన్నికలు ఏవైన ఆయన రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టాల్సిందే. మరికొద్ది రోజుల్లో రాబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ స్థానాలను దక్కించుకుని ప్రజల మద్దతు టీఆర్ఎస్‌కే ఉందన్న సంకేతాలను బలంగా తీసుకెళ్లేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ రామచంద్రరావు కొనసాగారు. అయితే.. వారి పదవీకాలం త్వరలో ముగిస్తుండడంతో కొత్తవారి ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈమేరకు ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆరు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నూతన రెవెన్యూ చట్టం, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా వారిలో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన విధానాలపై కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.