తెలంగాణలో బీఆర్ఎస్‌ను వరుసగా మూడోసారి గెలిపించి హ్యాట్రిక్ సీఎం అవ్వాలన్న కసితో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి, ఇటు ఈ మూలన ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వరుసగా రౌండ్లు వేసేస్తున్నారు. ఇక ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న నేతల్లో ఇద్దరు లీడర్లకు కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఆ ఇద్దరు నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తోన్న వారే కావడం విశేషం.
పాలేరులో పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిరలో పోటీ చేస్తోన్న జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్. ఈ ఇద్దరు నేతలను గెలిపిస్తే ఈ రెండు నియోజకవర్గాలకు మొత్తం దళితబంధును అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. పాలేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ కందాళ ఉపేందర్‌రెడ్డి తన నియోజకవర్గం మొత్తానికి దళితబంధు అమలు చేయాలని కోరిన వెంటనే ఓకే చెప్పేశారు. కందాళ డేర్‌గా ఈ కోరిక కోరిన వెంటనే కేసీఆర్ ఓకే చెప్పేయడం ఆయనకు బాగా ప్లస్ అయ్యింది.
ఇది పాలేరులో ఎస్సీ ఓటర్లలో బాగా చర్చకు వస్తోంది. వారంతా మళ్లీ కారే రావాలని గట్టిగా చర్చించుకుంటున్నారు. ఇది నియోజకవర్గ ఎస్సీ ఓటర్లలో బాగా స్ప్రెడ్ అవుతోంది. అయితే నిన్న మధిర సభలో పాల్గొన్న కేసీఆర్ అక్కడ పోటీలో ఉన్న జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్‌ను గెలిపిస్తే ఆ నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తామంటూ ఇచ్చిన ప్రకటన మధిరలో ఒక్కసారిగా మార్పునకు కారణమవుతోంది.
ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని చింతకాని మండలం మొత్తం దళిత బంధు అమలవుతోంది. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఈ పథకం అమలు చేస్తానని.. కమల్‌రాజ్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరడంతో అక్కడ కూడా ఎస్సీ వర్గాల్లో బాగా ప్లస్ అయ్యింది. ఇది రేపు గెలుపోటములను డిసైడ్ చేసే రేంజ్‌కు వచ్చేసింది. ఏదేమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ నూటికి నూరు శాతం దళితబంధు హామీ ఉపేందర్‌రెడ్డికి, లింగాల కమల్‌రాజ్‌ను గెలుపు వైపు నడిపించేంత చర్చ అండర్ కరెంట్‌గా నడుస్తోంది.