అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న భారతదేశం వంచించబడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన దేశం ఎన్నో అద్భుత అవకాశాలు కోల్పోతుందని తెలిపారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
“ఏ దేశమైనా, సమాజమైనా చుట్టు సంభవించే పరిణామాలు చూస్తూ అప్డేట్‌గా ఉండే ముందుకు పురోగమిస్తుంది. ఏమరపాటుతో ఉంటే చాలా దెబ్బ తింటాం. మన రాష్ట్రంలో మనం పడ్డ బాధనే గుర్తు చేసుకుందాం. నాటి నాయకత్వం తప్పిదం వల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు దశాబ్దాల కాలం పట్టింది. ఏడేండ్ల కింద తెలంగాణకు, ఇప్పుడున్న తెలంగాణకు చాలా తేడా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణను బాగు చేసుకున్నాం. దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి ఎదిగాం.” – కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ లాంటిదని.. అమెరికాలో వ్యవసాయ అనుకూల భూమి లేదని.. చైనాలో కూడా 16 శాతం మాత్రమే వ్యవసాయం భూమి ఉందని కేసీఆర్ అన్నారు. కానీ భారతదేశంలో 50 శాతం భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. అన్ని రకాల నేలలు కూడా ఉన్నాయని.. 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని.. ఇన్ని వనరులు, వసతులు ఉన్న ఈ దేశం వంచించబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.